నిర్మాణాలకు అనుమతులిచ్చే ముందు సంబంధిత ఆస్తి యాజమానులు చేసిన అభ్యంతరాలున్నాయో లేదో పరిశీలించాలంటూ జీహెచ్ఎంసీకి ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజోపయోగకరమైన పలు బాధ్యతలతో తలమునకలైన మున్సిపల్ అధికారులపై తమ విచక్షణాధికారంతో అదనపు భారం మోపలేమని పేర్కొంది.
యాజమాన్య హక్కులపై అభ్యంతరాలుంటే సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో కొనుగోలు చేసిన రెండు ఎకరాల స్థలంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం కోసం అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారని తెలిసి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ... పి.ప్రభావతి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.
ప్రైవేటు వ్యక్తులు తన స్థలంలో చేపట్టనున్న నిర్మాణాలకు అనుమతించే ముందు తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలంటూ జూన్ 15న జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, చీఫ్ సిటీ ప్లాననర్‌కు లేఖ రాసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. నిర్మాణం జరిగితే పిటిషనర్‌కు నష్టం వాటిల్లుతుందన్నారు.
జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది మధుబాబు వాదనలు వినిపిస్తూ... అలాంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే విధానం జీహెచ్ఎంసీలో లేదన్నారు. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులపై అభ్యంతరాలను తెలుసుకోవడం ఆచరణలో కష్టమన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి అనుమతులకు ఇతరులు దరఖాస్తు చేసినట్లు తెలిస్తే యజమాని అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉన్నప్పటికీ... ఇలాంటి అభ్యంతరాలు దాఖలయ్యాయో లేదో తెలుసుకోవడం ఆచరణలో కష్టమన్నారు.
నిర్మాణాలకు అనుమతించే ముందు నీరు, మురుగునీటి, రోడ్లు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుందని... అంతేగానీ వ్యక్తులకు ఆస్తుల రక్షణ కాదన్నారు. ఈ కేసులో పిటిషనర్ కనీసం రిజిస్ట్రేషన్ శాఖను సంప్రదించి ఈసీలను తీసుకోవడం... ఇతర లావాదేవీలు ఏమైనా జరిగాయా లేదా... స్థలానికి అనుమతులు తీసుకున్నారా లేదా అన్న అంశాలు తెలుసుకోకుండా కేవలం ఒక లేఖను జీహెచ్ఎంసీలో పడేసి నేరుగా కోర్టుకు రావాడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమానికి సంబంధించి పలు పనుల్లో తలమునకలైన జీహెచ్ఎంసీ అధికారులపై తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించి అదనపు భారం మోపలేమన్నారు. పిటిషన్‌పై విచారణను ముగిస్తూ చట్టప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చన్నారు.