ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరించింది. అనుమతి లేకుండా పరిశ్రమ నడిచేందుకు కారణమైన వారిని గుర్తించి ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలని చెప్పింది. తీసుకున్న చర్యలతో 2 నెలల్లో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ.50 కోట్ల మొత్తాన్ని పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు అందజేయాల్సిన పరిహారానికి వాడాలని చెప్పింది.
పర్యావరణ శాఖ, పీసీబీ మండలి నుంచి ఒకొక్కరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2 నెలల్లో కమిటీ పునరుద్ధర ప్రణాళిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని వెల్లడించింది. అలాగే... బాధితులకు పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి 2 వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించింది.
ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ తిరిగి ప్రారంభం కాకుడదని ఎన్‌జీటీ తేల్చి చెప్పింది. ప్రమాదక రసాయనాలతో కూడిన ప్లాంట్లలో పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడానికి, నిరోధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఎల్జీ పాలిమర్స్‌పై ఆగ్రహం
సుమోటోగా కేసు స్వీకరణపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం చెప్పటంతో ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. పర్యావరణానికి హాని కలిగినప్పుడు మౌనంగా కూర్చోలేమని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే తాము తీర్పులు ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబరు 3కి వాయిదా వేసింది.