రాయలసీమ ఎత్తిపోతలపై (Rayalaseema Lift Irrigation) ఎన్జీటీ చెన్నై ధర్మాసనం (NGT Chennai Tribunal)లో విచారణ జరిగింది. తెలంగాణ సమర్పించిన ఫొటోలు పరిశీలించిన ఎన్జీటీ... పనులు భారీగానే జరిగినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణకు ఏపీ పాల్పడినట్లు అర్థం అవుతోందని ఎన్జీటీ పేర్కొంది. ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా అని ప్రశ్నించిన ఎన్జీటీ... అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా అని అడిగింది.
అధికారులను జైలుకు పంపడంపై పిటిషనర్ల అభిప్రాయం కోరిన ఎన్జీటీ... అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదని తెలిపింది. తనిఖీ నివేదికను ఆన్‌లైన్‌లో ఎన్జీటీకి కేఆర్ఎంబీ సమర్పించలేదు. పర్యావరణ శాఖతో ఏపీ కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఇంతవరకూ పర్యావరణ శాఖ ఎందుకు నివేదిక ఇవ్వలేదని ఎన్జీటీ ప్రశ్నించింది.
ఈనెల 7నాటికే పనులను నిలిపివేశామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 7 తర్వాత ఎలాంటి పనులు చేయలేదని తెలిపింది. 27న తదుపరి చర్యలపై తీర్పు ఇస్తామని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం పేర్కొంది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
డీపీఆర్ ప్రతిని కోరిన సర్కార్...
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్ ప్రతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డుకు సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో తెలిపిందని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమకు డీపీఆర్ ప్రతిని వీలైనంత త్వరగా ఇస్తే దానిపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాలు చెబుతామని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: NGT Fire on AP Govt: ఏపీ సర్కారుపై ఎన్జీటీ ఫైర్... ప్రాజెక్టుల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు