పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఐఎస్) పనుల్లో తెలంగాణ ఉల్లంఘనలపై పరిశీలనకు ఏర్పాటైన జాయింట్ కమిటీకి నోడల్ ఏజెన్సీగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని నియమిస్తూ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27లోగా నివేదిక సమర్పించడానికి వీలుగా పీఆర్‌ఎల్‌ఐఎస్ పనుల పరిశీలన నిమిత్తం కమిటీకి నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ సహకరించలేదంటూ చంద్రమౌళీశ్వరరెడ్డి తరఫు న్యాయవాదితో పాటు ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎన్జీటీ దృష్టికి తీసుకురావడంతో నోడల్ ఏజెన్సీగా కృష్ణా బోర్డును నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతోపాటు పర్యావరణ ఉల్లంఘనలపై మహబూబ్‌నగర్‌కు చెందిన కోస్గి వెంకటయ్య దాఖలు పిటిషన్‌లో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదన వినాలంటూ ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా ఎన్జీటీ అనుమతించింది.
పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ కోస్గి వెంకటయ్య, తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు పనులు చేపడుతున్నామంటూ ఇరిగేషన్ అవసరాలకు ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడుతోందని కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వరరెడ్డిలు పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం విదితమే. వీటిపై శుక్రవారం ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు డాక్టర్ కె.సత్యగోపాల్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పీఆర్‌ఎల్‌ఐసీ పనుల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీని 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. కమిటీకి నోడల్ అధికారిగా ఉన్న తెలంగాణకు చెందిన గనులశాఖ డైరెక్టర్ సహకరించడంలేదని ఏపీ ప్రభుత్వంతో పాటు, పిటిషనర్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కమిటీ నోడల్ ఏజెన్సీగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డును నియమిస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా పీఆర్‌ఎల్‌ఐఎస్ పనులపై నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది.
మా రాష్ట్రానికి నష్టం: ఏపీ పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల వల్ల తమ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ఏపీ ప్రభుత్వం తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. పీఆర్‌ఎల్‌ఐఎస్ భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ పనుల్లో పర్యావరణ అనుమతుల్లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్ పరిమిత అభ్యర్థనతోనే ఉందన్నారు. 2017లో 90 టీఎంసీల సామర్థ్యంతో తాగు, సాగు అవసరాలకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై ట్రైబ్యునల్‌లో పిటిషన్‌లు దాఖలు కావడంతో కేవలం తాగునీటి అవసరాలకేనని పేర్కొందన్నారు. పాలమూరు ఎత్తిపోతలను 6.1 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, 83.9 టీఎంసీలు 12.3 లక్షల ఎకరాలకు సాగుకు అవసరమైన సామర్థ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు.
ఇదీ చూడండి: Tollywood drugs case: ఏ దేశానికి ఎంత మళ్లించారు?