తెలంగాణ ప్రజలు మంచి మనస్సు ఉన్నవాళ్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో అభివృద్ధి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల వ్యవసాయం, విద్యారంగాల్లో అభివృద్ధి దిశగా పనిచేస్తుందని వందరోజుల పాలనపై రాష్ట్రపతికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఇటీవల గిరిజనుల వద్దకు వెళ్లాలని వారిని రాజ్‌భవన్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. రక్తదానం కోసం ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని రెడ్ క్రాస్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 15లక్షల మంది సభ్యులుగా ఉండడం సంతోషాన్నిస్తుందన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించడం కూడా సంతోషంగా ఉందన్నారు.
ఇక నుంచి నెలకొకసారి రాజ్‌భవన్ వేదికగా ప్రజా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు స్వీకరించి పరిష్కారం కోసం ఒక వ్యవస్థను తీసుకువస్తామన్నారు. గవర్నర్‌ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, భాజపా నాయకురాలు డీకే అరుణ, బ్రహ్మకుమారీలు, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: నూతన సంవత్సరం... నూతన లక్ష్యాలు