Irregularities in PG Medicine: పీజీ వైద్యవిద్యలో కొత్త తరహా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. యాజమాన్య కోటా సీట్లను కొన్ని కళాశాలలు ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తున్నట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గుర్తించింది. ఇప్పటివరకూ మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించగా, అందులో సుమారు 45 అనుమానాస్పద దరఖాస్తులు ఉన్నట్లుగా గుర్తించి..వారందరికీ లేఖలు రాయడంతో అసలు విషయం బయటపడింది.
కాళోజీ ఆరోగ్యవర్సిటీ రిజిస్ట్రార్..
ప్రవీణ్‌కుమార్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి హరీశ్‌రావు సూచనతో వరంగల్ నగర కమిషనర్ తరుణ్ జోషికి సోమవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నీట్ పీజీలో అర్హత పొందిన అభ్యర్థులతో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ, వైద్యసంస్థ కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. యాజమాన్య కోటాలో ఒక్కో పీజీ సీటుకు రూ.23-24 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రవాస భారతీయ, వైద్య సంస్థ కేటగిరీలో అధికారికంగా రూ.69-72 లక్షల వరకూ, అనధికారికంగా కళాశాల ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సిందే. కొన్ని విభాగాల్లో (జనరల్ మెడిసిన్, రేడియాలజీ, పిడియాట్రిక్స్ వంటివి) పీజీ సీటు ఖరీదు రూ.2 కోట్ల వరకూ ఉంది. ఆరోగ్యవర్సిటీ అన్ని విడతల కౌన్సెలింగ్‌లు పూర్తిచేసిన తర్వాత కూడా సీట్లు మిగిలే పక్షంలో..చివరిగా ఆ సీట్లను ప్రైవేటు కళాశాల సొంతంగా భర్తీ చేసుకోవడానికి వెసలుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు అక్రమ మార్గాలను వెతుకుతున్నాయనే ఆరోపణలున్నాయి.
అక్రమాలు జరిగేదిలా?
విశ్వసనీయ సమాచారం ప్రకారం..కొన్ని ప్రైవేటు కళాశాలలు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో మంచి ర్యాంకు సాధించిన వారిని ఎంపిక చేసుకుని, వారికి కొంత మొత్తాన్ని ముట్టజెప్పడం ద్వారా వారి నీట్ ర్యాంకు కార్డు సహా ఇతర ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తాయి. ఆయా యాజమాన్యాలే వారి తరఫున యాజమాన్య కోటాలో దరఖాస్తు చేస్తాయి. సీటు వచ్చినా సదరు విద్యార్థి చేరకపోవడంతో ఆ సీటు ఖాళీగా మిగిలిపోతుంది. ఇలా ప్రతి విడత కౌన్సెలింగ్‌లోనూ వేర్వేరు వ్యక్తులతో దరఖాస్తు చేయడం, సీటు వచ్చిన తర్వాత చేరకపోవడం వల్ల ఆ సీట్లు మిగిలిపోతాయి. ఆఖరి విడత వరకూ దరఖాస్తు చేయిస్తూ సీట్లను మిగిలేలా చూసుకుంటే, ఆ సీట్లు ప్రవాస భారతీయ, వైద్య సంస్థ కోటాలోకి చేరే అవకాశాలున్నాయి. ఈ ఎత్తుగడనే కొన్ని ప్రైవేటు కళాశాలలు అనుసరిస్తున్నాయని ఆరోగ్య వర్సిటీ అనుమానిస్తోంది.
ఇలా బయటపడ్డాయి
‘‘వాస్తవంగా అఖిల భారత స్థాయిలో 100 లోపు పీజీ నీట్ ర్యాంకు సాధించిన అభ్యర్థి మాప్‌అప్ విడత వరకూ వేచి ఉండే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని అనుమానించి అటువంటి అభ్యర్థులు లేఖలు రాశాం. ‘ఒకవేళ ఇప్పటికే ఇతర కళాశాలలో చేరి కూడా మళ్లీ దరఖాస్తు చేసి ఉన్న పక్షంలో మీపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ’ లేఖల్లో హెచ్చరించాం. భయపడిన కొందరు తదుపరి విడతల్లో దరఖాస్తు చేయలేదు. ఏడుగురు తాము అసలు దరఖాస్తే చేయలేదని సమాధానమిచ్చారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలిపాయి.
ఇదీ చదవండి:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్