హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు వరంగల్ అర్బన్, కరీంనగర్ సహా 21 చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న 23 ఆఫీసులు రద్దయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 141 కార్యాలయాలు సంఖ్య పరంగా తగ్గకపోవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సమగ్ర వివరాల సమీకరణ
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీలు, రియల్ ఎస్టేట్ కార్యక్రమాలపై సమగ్ర వివరాలను అధికారులు సమీకరిస్తున్నారు. వ్యవసాయ భూముల కార్యకలాపాలు లేకపోతే కార్యాలయాల్లో పనిభారం ఎంత మేరకు ఉంటుందనే విశ్లేషణ చేస్తున్నారు. అత్యధిక వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు జరిగే ఆఫీసులను గుర్తిస్తున్నారు. పూర్వపు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంటుందో పరిశీలిస్తున్నారు. రెవెన్యూ చట్టం ఆమోదం అనంతరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణ ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పునరుద్ధరణకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మూతపడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అత్యధిక ప్రాంతాల్లో మూతపడ్డాయి. కొన్ని చోట్ల వివాహ నమోదు సహా నిర్దేశించిన ఇతర కార్యకలాపాలకోసం తెరిచారు. రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్లు చేస్తున్న 21 తహసీల్దార్ కార్యాలయాల్లో మంగళవారం క్రయవిక్రయ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు ఇలా...
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రిజిస్ట్రేషన్లు 16.6 లక్షలు
- ఇందులో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 4.6 లక్షలు
- రాబడి రూ.6,648 కోట్లు