ఇక పరాయి వ్యక్తికి మీ ఇంటిని నిర్భయంగా అద్దెకివ్వవచ్చు... భయం లేకుండా కారు డ్రైవర్‌ను నియమించుకోవచ్చు... మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... మీ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు, కారు డ్రైవర్‌ను పెట్టుకోవాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తుల వివరాలను పోలీసులకిస్తే చాలు. వారే విచారించి వారి చరిత్రను తవ్వి తీసి మీకు అందజేస్తారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఐదువేల మంది గురించి ఇలా వాకబు చేశారు.
నగరంలో 17 లక్షల కుటుంబాలు
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) లెక్కల ప్రకారం రాజధానిలో దాదాపు 20 లక్షల భవనాలున్నాయి. వాణిజ్య భవనాలు పోగా 17 లక్షల భవనాల్లో కుటుంబాలుంటున్నాయని అంచనా. నగరానికి వలసలు పెరుగుతుండటంతో అద్దె ఇళ్లకూ డిమాండ్ ఉంది. ఇదే సమయంలో ఇళ్లను అద్దెకిచ్చే విషయంలో యజమానులు అనేక సమస్యలెదుర్కొంటున్నారు. కొంతమంది అద్దెలివ్వడం లేదు... మరికొందరు ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. ఇంకొందరు అద్దె ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. అద్దెకు తీసుకున్న వారి గత చరిత్ర ఇళ్ల యజమానులకు తెలియకపోవడంతో వారు ఈ రకమైన ఇబ్బందులెదుర్కొంటున్నారు.
కారు డ్రైౖవర్లను నియమించుకోవాలనుకున్నప్పుడు, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్ల విషయంలోనూ ఇదే సమస్య ఎదురవుతోందని పోలీసులు గుర్తించారు. తప్పతాగే అలవాటున్న వారు సైతం కారు డ్రైవర్‌గా నియమితులై అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలి కాలంలో అనేకమంది తమ ఇబ్బందులను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ దృష్టికి తీసుకురాగా...దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షించిన ఆయన బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఇంటిని అద్దెకివ్వాలనుకున్న వారు అద్దెకు తీసుకోవడానికి వచ్చే వారి ఆధార్ కార్డు లేదా ఇతరత్రా వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌లో అందజేస్తే వారం రోజుల వ్యవధిలో విచారించి సమగ్ర నివేదికను పోలీసులు అందజేస్తారు. గత కొంతకాలంగా దాదాపు అయిదువేల మంది గురించి పోలీసులు విచారించి నివేదికలను అందజేశారు. మహా నగరంలో 63 పోలీసుస్టేషన్లున్నాయని సహాయం అవసరమైన వ్యక్తులు అక్కడికి వెళ్లి దరఖాస్తు చేస్తే సరిపోతుందని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ‘ఈనాడు’కు తెలిపారు.
ఇదీ చూడండి: 2018-19 వృద్ధి రేటు సవరణ- 6.1శాతానికి తగ్గింపు