పాసుపుస్తకాలు అందని రైతులకు కొత్త పుస్తకాలు ఎవరిస్తారనేదానిపై క్షేత్రస్థాయిలో అయోమయం నెలకొంది. ప్రభుత్వం పాత ఆర్‌ఓఆర్ చట్టం రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చింది. అప్పటినుంచి తహసీల్దార్లు భూ సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికీ పాసుపుస్తకాలు రాని రైతులకు కొత్తవి అందించడం, భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ-2017) అనంతరం పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం లేదు. మరోవైపు ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది. దీంతో వివాదాలను పరిష్కరించే అధికారాలు తహసీల్దార్లకు లేకుండా పోయాయి.
తెలంగాణ భూమి హక్కులు, పట్టా పాసుపుస్తకాల చట్టం-2020 కింద ధరణి పోర్టల్ వేదికగా డిజిటల్ రూపంలో భూముల నిర్వహణను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పోర్టల్లోని సమాచారం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల నిర్వహణను తహసీల్దార్లు చేపడతారు. క్రయవిక్రయాల అనంతరం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూముల భాగ పంపిణీ, వారసత్వ బదిలీ, బహుమతి, నాలా అనుమతులు జారీ చేస్తారు. అయితే ధరణి పోర్టల్లో పేర్కొనని సేవలు ఎలా అందించాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవర్ని సంప్రదించాలి? అనేవి అటు రెవెన్యూ వర్గాలు, ఇటు ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలు.
చిన్న చిన్న సమస్యలతో పాసుపుస్తకాలు అందనివారు ఎంతోమంది ఉన్నారు. వాటిని తరువాత పరిష్కరిద్దామని, తొలుత స్పష్టత ఉన్నవారికి పాసుపుస్తకాలు జారీ చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ సిబ్బంది చాలామంది రైతుల భూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. వాటన్నింటినీ పార్ట్-బీ (వివాదాస్పద జాబితా) ఖాతాలో చేర్చారు. వీటిని ఎవరు పరిష్కరిస్తారని బాధితులు అడుగుతున్నారు.
ప్రధానమైన సమస్యల్లో కొన్ని
* కొత్త పాసుపుస్తకాల జారీ
* గత నెల 7కి ముందు వరకు మ్యుటేషన్‌లకు అందిన దరఖాస్తుల పరిష్కారం
* వీలునామా, జీపీఏలు
* టీఎస్‌ఐఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్లోకి చేరని సర్వే నంబర్లు
* పాసుపుస్తకాల్లో తక్కువగా నమోదైన భూ విస్తీర్ణంలో తేడాలను సరిచేయడం
* పాసుపుస్తకాల్లో తప్పులు సరిచేయడం
ఇదీ చదవండి: దగ్గర పడుతున్న గడువు... ధరణి సాగేనా సాఫీగా..?