హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌లను త్వరలోనే తయారు చేసి.. కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే సమర్పించనున్నామని టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహా రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ ఆధ్వర్యంలో 'ఏడీబీ చేపడుతున్న ప్రాజెక్టుల్లో వ్యాపార అవకాశం' అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల కోసం ఏడీబీతో సహా ఇతర అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణలో గల అవకాశాలను వివరించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
రూ. 15వేల కోట్లతో..
టీఎస్‌ఐఐసీ తరఫున పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతుల కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నామని నరసింహరెడ్డి తెలిపారు. తెలంగాణలో నిర్మితమౌతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌లో చేపడుతున్న పనులను వర్ణించారు. రూ. 15వేల కోట్ల వ్యయంతో 15వేల ఎకరాల్లో ఇది రానుందని తెలిపారు. రెండు ఫేస్‌ల కింద నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిమ్జ్(నేషనల్ ఇన్వెస్టిమెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్)గా గుర్తించిందని తెలిపారు. మొత్తం రూ.6500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని, ఫేస్-1లో 3500 ఎకరాలు సేకరణ పూర్తైనట్లు తెలిపారు. మల్డీ మోడల్ లాజిస్టిక్ పార్కు, ఏరో స్పేస్, మౌలిక సదుపాయాల్లో సహకారం గురించి కూడా నరసింహా రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి: శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ