సైబర్ నేరాల కట్టడిపై సర్కారు దృష్టి సారించింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల తరహాలో సైబర్ నేరాలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్ సహా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ప్రస్తుతం సైబర్ నేరాల బాధ్యతను ఏసీపీలు నిర్వర్తిస్తున్నారు. ఇక నుంచి డీసీపీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ విభాగం కోసం ప్రభుత్వం ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టించింది. మూడు కమిషనరేట్లలో ప్రతి సంవత్సరం దాదాపు 4 వేల కేసులు నమోదవుతుండటంతో పోలీస్ ఉన్నతాధికారుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని ఎందరో బలవుతున్నారు. ఈ సైబర్ మోసాలపై పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నా.. అనేక మంది మోసపోతూనే ఉన్నారు. ఈ తరహా నేరాల నియంత్రణపై కొత్తగా రానున్న ప్రత్యేక విభాగం దృష్టి సారించనుంది. పోలీస్‌స్టేషన్‌ల వారీగా వచ్చే ఫిర్యాదులను విశ్లేషించి.. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ఠాణాలపై దృష్టి సారించనుంది.
తొమ్మిదికి చేరనున్న డీసీపీల సంఖ్య..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అదనంగా 4 డీసీపీ పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం కమిషనరేట్‌లో ఐదుగురు డీసీపీలు ఉండగా.. కొత్త పోస్టులతో కలిపి డీసీపీల సంఖ్య తొమ్మిదికి చేరనుంది. కొత్త వారిని డీసీపీ టాస్క్‌ఫోర్స్ దక్షిణ మండలం, డీసీపీ ప్రత్యేక విభాగం, డీసీపీ సాయుధ విభాగం, డీసీపీ పరిపాలన.. పోస్టుల్లో నియమించనున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్లలో అదనపు డీసీపీలుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి వచ్చిన నేపథ్యంలో వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడు విడివిడిగా.. ఇకపై సమష్టిగా
ఈ తరహా నేరాలపై ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ల వారీగానే కేసులను దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఒకే ముఠాను పట్టుకునేందుకు అనేక మంది పనిచేస్తున్నారన్న మాట. అలా కాకుండా దర్యాప్తును ప్రత్యేక బృందం ద్వారా చేస్తే పని భారం తగ్గడంతో పాటు కేసును త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందని, బాధితులకు త్వరగా న్యాయం చేయొచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. నిందితులకు వెంటనే బెయిలు రాకుండా చేయడంతో పాటు కఠిన శిక్షలు పడేలా చూడవచ్చు. అన్నింటినీ మించి ఒకే ముఠా కోసం వేర్వేరు పోలీసు బృందాలు వెళ్లకుండా చూడటం ద్వారా మానవ వనరులను పొదుపుగా వాడుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.
ఇదీ చూడండి: CM KCR: 'వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు'