రెవెన్యూ వ్యవస్థకు సమూల చికిత్స చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త చట్టంతోపాటు వివిధ స్థాయిల్లోని అధికారుల వ్యవస్థల్లోనూ మార్పులు తీసుకురానున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే కొత్త చట్టం ముసాయిదా తయారీ చేపట్టినా, వివిధ కారణాలతో అది అమలులోకి రాలేదు. తాజాగా చట్టం అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు గుర్తుచేయడంతో మళ్లీ పట్టాలకు ఎక్కించినట్లు సమాచారం.
పూర్తిగా ఆన్‌లైన్ ఆధారిత సేవలు, మ్యుటేషన్ సంబంధిత మార్పుచేర్పులను కూడా ఈ చట్టం ద్వారా పూర్తి చేయాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం పలువురు విశ్రాంత ఐఏఎస్‌లు, రెవెన్యూ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
వ్యవస్థల మార్పుతో శ్రీకారం
రెవెన్యూ వ్యవస్థలోని లోపాలకు కారణమైన వివిధ విభాగాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. భూ క్రయవిక్రయాల అనంతరం యాజమాన్య హక్కుల మార్పిడి సమయంలో (మ్యుటేషన్) క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం అక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికోసం గ్రామ రెవెన్యూ అధికారులు, సహాయకుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించనున్నారు. శాఖకు అవసరమైనంత స్థాయిలో అర్హులైన వీఆర్‌వోలను కొనసాగించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. వీఆర్‌ఏల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని, మండల స్థాయిలో రెవెన్యూకు సహాయకులు అవసరమున్నందున వీరిని కొనసాగించవచ్చన్న ఆలోచన కూడా కనిపిస్తోంది. వీఆర్‌వోకు సంబంధం లేకుండా తహసీల్దారు స్థాయిలోనే మ్యుటేషన్ పూర్తయ్యేలా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. భూముల సరిహద్దు సమస్యల పరిష్కారం ఆర్డీవోల పరిధిలో చేర్చే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
కీసర అవినీతి సంఘటనతో ప్రభుత్వం గుర్రు
కీసర మండల తహసీల్దారుగా పనిచేసిన నాగరాజు భారీ మొత్తంలో లంచం తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేశంపేట, షేక్‌పేట, నాగర్‌కర్నూల్, కీసర సంఘటనలు ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖపై ఉన్న అసంతృప్తిని మరింత పెంచాయని తెలిసింది. కీసర ఘటన వెనుక ఉన్న ఉన్నతాధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్