రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు.. రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరిగాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. వ్యక్తి గత భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఎస్పీపేర్కొన్నారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తామని.. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలోని ప్రజలకు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది వెళ్లి మోటార్ వాహనాల చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా వాహనాదారులు సహకరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు ఆసరా కోల్పోయి రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మానవ తప్పిదాలు, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణమని చెప్పారు. ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.