National Nutrition Week: మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు.. వారి చిన్నతనంలో సజ్జ అన్నం, సజ్జ రొట్టెలను ఆహారంగా తినేవారు. ఇప్పుడు అవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనో లేదా నగరాల్లోని ప్రముఖ హోటళ్లలోనో మాత్రమే కనిపిస్తున్నాయి. సజ్జలను నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి వ్యాధులను నియంత్రించే అనేక పోషకాలు వీటిలో ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 56 శాతం జనాభా రక్తహీనత(అనీమియా)తో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.
Sajjala Pakodi : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంది. బియ్యం, గోధుమల కన్నా సజ్జల్లో ఇనుము, జింకు పోషకాలు అధికంగా ఉంటాయని, వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనీమియా బారిన పడకుండా ఉండవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ సైతం సూచించింది. సజ్జల నుంచి బిస్కెట్లు, కేక్‌లు, రొట్టెలు సులభంగా తయారుచేసేలా ‘భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ’(ఐఐఎంఆర్), ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని పలు సంస్థలు వినియోగించి సజ్జ ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో ‘చిరుధాన్యాల ఆహారం’ అందించే ప్రత్యేక హోటళ్లలో సజ్జ ఆహారోత్పత్తులకూ డిమాండ్ ఉంటోంది.
ఇవీ ప్రయోజనాలు.. సజ్జలను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణశక్తి, గుండె పనితీరు మెరుగుపడతాయి. ఇందులోని అమీనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఉపకరిస్తాయి.
- మధుమేహంతో బాధపడేవారు రోజూ సజ్జ అన్నం లేదా రొట్టెలు తినడం వల్ల గోధుమ రొట్టెల కన్నా ఎక్కువ ప్రయోజనాలుంటాయి.
- బిర్యానీలు, మసాలా వంటకాలు తిని.. కడుపులో మంట, అజీర్తి వంటి వాటితో ఇబ్బంది పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యలను సజ్జలు నియంత్రిస్తాయని నిపుణులు తెలిపారు.
- ఆరు నెలలు దాటిన శిశువులకు సజ్జల అన్నాన్ని కూరగాయలు, పండ్లతో కలిపి అందించాలి. వరి అన్నంతో పోలిస్తే ఇది తల్లులు, చిన్నపిల్లలకు ఎంతో మంచిదని పరిశోధనల్లో గుర్తించారు.
- సజ్జల ఆహారం నిదానంగా జీర్ణమవుతుంది. వెంటనే ఆకలి కాదు. ఫలితంగా ఊబకాయం రాకుండా పరిమితంగా తినడం అలవాటవుతుంది.
- ఉదాహరణకు ఒక మనిషి 100 గ్రాముల సజ్జల ఉత్పత్తులను తింటే శరీరానికి 364 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. 100 గ్రాముల వరి అన్నం తింటే 345, గోధుమలైతే 346 కిలో కేలరీలే లభిస్తాయని జయశంకర్ వర్సిటీ చిరుధాన్యాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేశ్ తెలిపారు.