పౌష్టికాహార లోపం మీద గెలిచేందుకు కేంద్రం చిరుధాన్యాల విప్లవం దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. కొవిడ్-19 నేపథ్యంలో మోదీ సర్కారు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే... హరిత విప్లవం, శ్వేత విప్లవం ద్వారా ఆహారం, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన భారత్... పౌష్టికాహర లోపాన్ని ఎదుర్కొంటోంది. సరైన ఆహారం లేక.. చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో... సుస్థిర, ఆకర్షణీయ సేద్యంగా చెప్పుకుంటున్న చిరుధాన్యాల పంటసాగు తెరపైకి వస్తోంది. భాగ్యనగరం మార్కెట్‌లో చిరుధాన్యాల లభ్యత పెంపుపై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. రాబోయే మూడేళ్ల కాలంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలంటే... రైతులు, రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, అంకుర కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది.
జాతీయ స్థాయి వెబినార్..
హరిత విప్లవం నేపథ్యంలో ఆహార భద్రత సాధించినప్పటికీ ప్రస్తుతం పోషకాహార భద్రత మన ముందున్న పెద్ద సవాల్. ఇది అధిగమించాలంటే దేశీయంగా చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం పెంచడమే గాక.. వాటి వినియోగం సైతం పెద్ద ఎత్తున పెంచడం ఒక్కటే మార్గం. చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహక మద్దతు ధరలు కూడా లభిస్తాయి. రాష్ట్రీయ పోషణ్ మాహ్ సందర్బంగా రాజేంద్రనగర్ జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థలో ఐడీఏ, ఎన్‌ఎస్‌ఐ, ఐఎఫ్‌సీ, ఏఎఫ్‌ఎస్‌టీఐ ఆధ్వర్యంలో అత్యవసర పౌష్టికాహార మార్కెట్ - చిరుధాన్యాల లభ్యతలు అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి వెబినార్‌ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దిల్లీ నుంచి ప్రారంభించి.. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, కేంద్ర అదనపు కార్యదర్శి మనోజ్ జోషి, ఒడిశా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గార్గ్, రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్, పలు రాష్ట్రాల శాస్త్రవేత్తలు, అంకుర కేంద్రాలు, చెఫ్ సంస్థలు, ఎఫ్‌పీఓల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలకు విపరీతమైన డిమాండ్..
దేశీయంగా అంతరించిపోతున్న చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న తరుణంలో.. ప్రొసెసింగ్, నిల్వ, అదనపు విలువ జోడింపు, మార్కెటింగ్, వినియోగం, విదేశీ ఎగుమతులు పెంచడం వంటి అంశాలపై ఈ వెబినార్‌లో విస్తృతంగా చర్చించారు. పూర్వ సంప్రదాయ ఆహారమైన చిరుధాన్యాలు వదిలేసి బియ్యం, గోధుమలు తీసుకోవడంవల్ల పెద్దలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తి అనారోగ్యాల పాలవుతున్నారని, ఇది అధిగమించాల్సిన తరుణం ఆసన్నమైందని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రపంచ విపణిలో చిరుధాన్యాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న దృష్ట్యా భారత్‌లో బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు సాగు చేసి ఎగుమతులు చేసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ విలాస్ ఏ తొనాపీ అన్నారు.
శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాల్సిన సమయం..
వాతావరణ మార్పుల నేపథ్యంలో తరగిపోతున్న సహజ వనరుల దృష్ట్యా వరి, పత్తి, గోధమకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయి. ఐసీఏఆర్, అనుబంధ జాతీయ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాల్సిన తరుణం ఇదే. కొవిడ్-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం తప్పనిసరైంది. ఈ విషయమై.. ప్రత్యేకించి పౌష్టికహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న వేళ మార్కెట్‌లో చిరుధాన్యాలు, ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు మంచి గిరాకీ పెరిగింది. అంతర్జాతీయంగా 27 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం ఉండగా... ప్రస్తుతం 9 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కెట్ నడుస్తోంది. అది 2023-23 నాటికి 24 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరాలన్నది లక్ష్యం.
ఇంటింటికీ చిరుధాన్యాలు చేరేలా..
ప్రస్తుతం భారత్ విదేశీ ఎగుమతుల వ్యాపారం 4.5 మిలియన్ యూఎస్ డాలర్లు. వచ్చే రెండేళ్లల్లో బిలియన్ యూఎస్ డాలర్లకు చేరాలని లక్ష్యం నిర్దేశించుకుంది. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఇతర ప్రొటీన్లు అధికంగా గల చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల బాగా ఉంటుంది. ఈ ప్రాధాన్యతను మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారీ వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే చిరుధాన్యాల వంగడాలు అందుబాటులో ఉన్నందున సాగునీటి సదుపాయాలు లేని ఆరుతడి ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగు చేసి చక్కటి వాతావరణ ఆకర్షణీయ, సుస్థిర వ్యవసాయంగా మార్చుకోవచ్చు. నీతి ఆయోగ్ కూడా చిరుధాన్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులు, వ్యాపారులు, ప్రొసెసింగ్, పరిశ్రమ, ఎఫ్‌పీఓలు, అంకుర కేంద్రాలను ఇందులో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఐఐఎంఆర్ న్యూట్రీ హబ్ సీఈఓ దయాకరరావు స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి చిరుధాన్యాలు తీసుకెళ్లడం ద్వారా గృహ వినియోగం భారీగా పెంచాలన్నదే నీతి ఆయోగ్ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల నేపథ్యంలో త్వరలో ఓ శ్వేత పత్రం తయారు చేసి నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి చిరుధాన్యాల సమగ్ర విధానంపై నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని ఐఐఎంఆర్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి : 'పంటనష్టంపై సర్వే చేయించండి'