తెలంగాణలోని పటాన్‌చెరు, బొల్లారం, కూకట్‌పల్లి, కాటేదాన్‌లలో నీటి కాలుష్యం పెరిగిపోతోందని, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి, బొల్లారంలలో గాలిలో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన అంశాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో గాలిలో, నీటిలో, భూమిపై కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర పర్యావరణ కాలుష్య సూచీ (సీఈపీఐ) దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక ప్రాంతాలు, క్లస్టర్లకు సంబంధించి విడుదల చేసిన గణాంకాలను ధర్మాసనం పరిశీలించింది.
నిబంధనలు ఉపేక్షించొద్దు..
నిబంధనలు ఉల్లంఘించిన కాలుష్య కారకమైన పెద్ద పరిశ్రమలకు రూ.కోటి, మధ్యతరహా పరిశ్రమలకు రూ.50 లక్షలు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.25 లక్షలు జరిమానా విధించాలని ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది. పర్యావరణ, ప్రజారోగ్య నష్టాలను పరిగణనలోకి తీసుకొని గత ఐదేళ్లుగా కాలుష్య కారక పరిశ్రమల నుంచి పరిహారం వసూలు చేయాలని పేర్కొంది.
జనవరి 2020 లోపు..
ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలను అనుమతించొద్దని తెలిపింది. ‘గాలి, నీరు, ఇతర కాలుష్యాలకు సంబంధించి సమాచారాన్ని రాష్ట్రాల పీసీబీలతో కేంద్ర పీసీబీ సమన్వయం చేసుకోవాలి. ఆయా వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కాలుష్య కారకాలైన పరిశ్రమలపై తీసుకొన్న చర్యలు తెలియజేయాలి. చర్యలు తీసుకోవడంలో విఫలమైతే కేంద్ర, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ల ఛైర్మన్లు, సభ్య కార్యదర్శులపై చర్యలకు వెనుకాడబోం. వారినుంచి జరిమానా రాబడతాం. 31.1.2020 లోపు తీసుకున్న చర్యలను రాష్ట్రాల పీసీబీలు కేంద్ర పీసీబీకి అందజేయాలి. సీపీసీబీ వాటిని పట్టిక రూపంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు 15.2.2020లోపు అందజేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చూడండి : నవంబర్లోనే పంజా విసురుతోన్న చలి