NarendraSingh Tomar Hyderabad tour : వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పని చేస్తాయని కేంద్రమంత్రి తోమర్ స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ - ఈఈఐ గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
వ్యవసాయం అనేది ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చే రంగంగా కొనసాగుతుందని తెలిపారు. జీ-20 సదస్సు నేపథ్యంలో ప్రపంచ సంక్షేమంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని.. దేశాభివృద్ధికి రానున్న 25 ఏళ్లు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. దేశం కోరుకున్నదంతా సాధించే శక్తి ఇప్పుడు పెరిగిందని అన్నారు. పరిశోధన ఫలాలను రైతుల్లోకి తీసుకెళ్లాలని విస్తరణాధికారులను కోరారు.
ల్యాబ్, భూమిని అనుసంధానించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించడం, మార్కెటింగ్ లింకేజీ కోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేలా కృషి చేయాలని దిశానిర్థేశం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇతర విద్యా సంస్థల్లో అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు అందజేస్తున్న పెట్టుబడి రాయితీ మద్దతు మిగతా ప్రజలకు అందించడం తప్ప మరొకటి కాదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెట్టుబడి రాయితీ కోసం రైతులను ఆదుకోవడంలో రైతుబంధు పథకం ప్రపంచంలోనే మొదటి కార్యక్రమం అని చెప్పారు. తొమ్మిదేళ్లకాలంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతాంగం బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించారు. వ్యవసాయ డేటాబేస్ నిర్వహించడానికి ప్రతి 5 వేల ఎకరాలకు విస్తరణ అధికారిని నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పంటల సాగుతోపాటు.. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులే శాస్త్రవేత్తలని.. రైతుల జ్ఞానం నేర్చుకుని ధ్రువీకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా అధికారులను కోరారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వరదలకు తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే రకాలు, చీడపీడలు, తెగుళ్లు తట్టుకునే వండగాలు రైతుల చెంతకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంత్, ఈఈఐ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
"దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక.. వ్యవసాయఅనుబంధ రంగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. జీ-20 సదస్సు నేపథ్యంలో ప్రపంచ సంక్షేమంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశం కోరుకున్నదంతా సాధించే శక్తి ఇప్పుడు పెరిగింది". - నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయమంత్రి
"రైతులకు అందజేస్తున్న పెట్టుబడి రాయితీ మద్ధతు మిగతా ప్రజలకు అందించడం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో పంటల సాగుతోపాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాము. రైతులను ఆదుకోవడంలో రైతుబంధు పథకం ప్రపంచంలోనే మొదటి కార్యక్రమం". - సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి
ఇవీ చదవండి: