క్యాన్సర్ రోగుల వైద్య నివేదికలను భద్రపరిచేందుకు వీలుగా బసవతారకం ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ రికార్డ్స్ నూతన విభాగాన్ని ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇప్పటికే రోగుల రికార్డులను భద్రపరిచేందుకు మెడికల్ రికార్డ్స్ విభాగం అందుబాటులో ఉండగా.. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఒక్కో క్యాన్సర్ రోగి.. చికిత్స కోసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. వారికి చేసిన పరీక్షలు, చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు భద్రపరచటం.. అవసరమైన సమయంలో తిరిగి అందించటమే ఈ సదుపాయం ముఖ్య ఉద్దేశం. ఫలితంగా క్యాన్సర్ రోగుల చికిత్సలో మరింత వేగం పుంజుకుంటుందని బాలయ్య పేర్కొన్నారు. రికార్డుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్, ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, అసోసియేట్ డైరెక్టర్ కల్పనా రఘనాథ్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KRMB: హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి: తెలంగాణ