న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేయకుండా కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీని ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ న్యాక్... విద్యా సంస్థల నాణ్యతను మదించి గ్రేడ్ ఇస్తుంది. విద్యా సంస్థలో వసతులు, బోధన ప్రమాణాలు, కోర్సు పూర్తయిన తర్వాత ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి తదితర అంశాలను మదించి గ్రేడ్ ఖరారు చేస్తుంది.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటి వరకు న్యాక్ ఏ గ్రేడ్ ఉంది. అక్రిడేషన్ పునరుద్ధరణ కోసం గతేడాది డిసెంబరు 13న దరఖాస్తు చేసుకుంది. వీరు సమర్పించిన పత్రాల్లో బీహెచ్ఈఎల్, ఎయిర్ టెల్, యాష్ టెక్నాలజీల పేరుతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ బోగస్ నివేదికలు సమర్పించినట్లు న్యాక్ గుర్తించింది.
గత నెల 22న జరిగిన న్యాక్ 88వ ఈసీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అక్రిడేషన్ కోసం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ సమర్పించిన దరఖాస్తును తిరస్కరించడంతో పాటు ఐదేళ్ల పాటు దరఖాస్తు చేయకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని న్యాక్ పాలక మండలి తీర్మానించింది. న్యాక్ పరిపాలన అధికారి... ఈ నిర్ణయంపై మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా