NABARD officers protest: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని నాబార్డు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఎదుట అఖిల భారత నాబార్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్, అఖిల భారత విశ్రాంత అధికారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ - డీఎఫ్ఎస్, జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
వేతన సవరణ, భవిష్యత్తుకు చిక్కులు కలిగిస్తున్నందున విశ్రాంత సిబ్బంది, అధికారులకు మద్ధతు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబరు 14న డీఎఫ్‌ఎస్ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి నాబార్డు అధికారులు ఆందోళన చేపడుతున్నారు. ఆ ఉత్తర్వులు అమలు చేయాలని సెప్టెంబరు 21న అడ్మినిస్ట్రేటివ్ సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో గత రెండు నెలలుగా డీఎఫ్ఎస్ అధికారులతో అనేక ప్రాతినిధ్యాలు, రౌండ్ల సంభాషణలు జరిగినా సత్ఫలితాలు రాలేదు. అనంతరం పార్లమెంటుకు మార్చ్, నిరాహార దీక్షతో సమ్మె చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని ఏఐఎన్‌బీఓఏ నేతలు ఆక్షేపించారు.
1982లో నాబార్డ్ ఏర్పాటు సమయంలో ఆర్బీఐ నుంచి లేదా నాబార్డు ద్వారా నేరుగా నియమితులైన వారికి, తక్కువ స్థాయి అధికారులకు ఒకే క్యాడర్‌లో డ్యూయల్, డిఫరెన్సియేటెడ్ వేతనం ఈ ఆర్డర్ ప్రవేశపెట్టిందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తగ్గించబడిన అలవెన్సుల్లో ఒకటి గ్రేడ్ అలవెన్స్, ఇది అధికారి గ్రేడ్ ప్రకారం చెల్లించబడుతుందని అన్నారు. అయితే డీఎఫ్‌ఎస్ ఆర్డర్ ప్రకారం తక్కువ గ్రేడుల్లోని అధికారులు అధిక గ్రేడ్‌లో ఉన్న అధికారుల కంటే ఎక్కువ గ్రేడ్ అలవెన్స్‌ని తీసుకుంటారని, తద్వారా “గ్రేడ్” అనే నామకరణాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఇది సంస్థలో "సమాన పనికి సమాన వేతనం"కు విరుద్ధమని ధ్వజమెత్తారు. 2017 నుంచి ఇవాళ్టి వరకు తమకు చెల్లిస్తున్న భత్యాలు ఆర్బీఐ నుంచి వచ్చిన అధికారుల కంటే తక్కువగా ఉంటున్నాయని, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడం వల్లే గత ఐదేళ్లుగా తాము పోరుబాట పట్టాల్సి వచ్చిందని ఆ సంఘాల నేతలు ఆరోపించారు.
ఇవీ చదవండీ :