వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతుల ఆదాయాల రెట్టింపు లక్ష్యంగా వ్యవసాయ పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేస్తున్నామని ఐసీఏఆర్ - నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రకృతి విపత్తులను అధిగమించే దిశగా శాస్త్రవేత్తలు, ఆచార్యులను నార్మ్ తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రముఖ రైతాంగ నేత, పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్జీ రంగా 120వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్ నార్మ్ ప్రాంగణంలో జరిగిన వెబినార్ నిర్వహించారు. ఈ సదస్సులో దిల్లీ నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని డాక్టర్ శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ యువతే కాకుండా పట్టణ, నగర ప్రాంతాల విద్యావంతులు, అంకుర కేంద్రాల నిర్వాహకులు వ్యవసాయం వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ వెబినార్‌లో ముంబయి నుంచి నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, వివిధ ప్రాంతాల నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా వాతావరణ మార్పుల సలహాదారు డాక్టర్ అంచ శ్రీనివాసన్, రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జి.మణిరత్నం, మాజీ ఎంపీ యలమంచిలి శివాజి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకటరోశయ్య, ఏఎన్‌జీఆర్‌ఏయూ ఉపకుపలతి డాక్టర్ ఎ.విష్ణువర్థన్‌రెడ్డి, భారత పొగాకు బోర్డు ఛైర్మన్ వై.రఘునాథ్‌బాబు, ఒంగోలు రంగా ట్రస్ట్ ఛైర్మన్ ఆళ్ల వెంకటేశ్వరరావు, ఆచార్య బి.సారంగపాణి, రంగా ట్రస్ట్ ప్రతినిధి ఆర్.కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: వెంకయ్య నాయుడు