హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు ఆ ప్రాంత కార్పొరేటర్ అండగా నిలుస్తున్నారు. ముషీరాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వస్తున్న కరోనా అనుమానితులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ఉచితంగా ఆహారాన్ని అందజేస్తున్నారు. బాధితులు ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆమె తెలిపారు.
కరోనాను తరిమికొట్టేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి తమ వంతు సహకారాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా సోకి హోం క్వారంటైన్లో ఉన్నవారికి ఇంటి వద్దకే భోజనాన్ని పంపిస్తున్నట్లు కార్పొరేటర్ సుప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గం భాజపా కో కన్వీనర్ నవీన్ గౌడ్, నాయకులు అనిల్ కుమార్, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం