హైదరాబాద్ శివారులోని కొన్ని పట్టణాల్లో సరైన పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక లేకపోవడం స్థానికులకు ఇబ్బందిగా మారిందని పురపాలకశాఖ తనిఖీల్లో తేలింది. పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు సంచాలకులు గత నెల చివరి వారంలో 3రోజులపాటు 13 పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా పట్టణాల్లో పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణను పరిశీలించి ఉన్న లోటు పాట్లతో పాటు మంచి విధానాలను గుర్తించారు.
బయటపడ్డ లోపాలు:
13 పట్టణాల్లోనూ పారిశుద్ధ్య ప్రణాళిక రూపొందించలేదని, సమర్ధ పారిశుధ్య నిర్వహణపై అవగాహన లేదని గుర్తించారు. చెత్త సేకరణకి వినియోగించే ప్రైవేట్ వాహనాలపై మున్సిపల్ అధికారుల నియంత్రణ లేదని తేలింది. అన్ని చోట్లా ఇంటి వద్దే తడి, పొడి చెత్త వేరు చేయడం లేదని పురపాలకశాఖ తనిఖీల్లో బయటపడింది.
శంషాబాద్ మినహా మిగతా చోట్ల చెత్త తరలించే వాహనాల్లో విడిగా ఎలాంటి కంపార్ట్ మెంట్ లేదని గుర్తించారు. చాలా చోట్ల సిబ్బంది కొరత ఉన్నట్లు తేలింది. ఉన్న సిబ్బందికి కూడా బయోమెట్రిక్ ఆధారంగా కాకుండా మాన్యువల్ విధానంలో వేతనాలు ఇస్తున్నట్లు గుర్తించారు.
పురపాలకశాఖ ఆదేశాలు:
ఈ క్రమంలో సమగ్ర ప్రణాళికతో పాటు చెత్త తరలించే వాహనాలన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించాలని పురపాలకశాఖ ఆదేశించింది. కార్మికులందరికీ బయోమెట్రిక్ ద్వారానే వేతనాలు అందించాలని మున్సిపల్ కమిషనర్లకు స్పష్టం చేసింది. ప్రతి 15 రోజులకోసారి పారిశుధ్యంపై ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలని సూచించింది.
ఇదీ చదవండి: మరపురాని గెలుపు- భారత క్రికెట్లో మరో మలుపు