'కుడా' అభివృద్ధి అంశాలపై నేడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించనున్నారు. అత్యంత పకడ్బందీగా "కుడా" మాస్టర్ ప్లాన్‌ని సిద్ధం చేయాలని వరంగల్ నగర అభివృద్ధిపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రణాళికకు మరిన్ని మెరుగులు దిద్ది, భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా రూపొందించాలని తీర్మానించారు. చారిత్రాత్మక కాకతీయ వారసత్వ నగరం వరంగల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని వరంగల్ అభివృద్ధిపై సమీక్ష చేపట్టారు. త‌్వరితగతిన సీఎం హామీల పనులను పూర్తి చేయాలని, మామునూర్ ఎయిర్ పోర్టును పునరుద్ధరించాలని సమావేశం చర్చించింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వరంగల్ నగర అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, కుడా ప్రణాళిక, మామునూర్ విమానాశ్రయంపై చర్చ నిర్వహించారు. సమీక్ష సమావేశంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
పరిశీలించి మాస్టర్ ప్లాన్ !!
'కుడా' మాస్టర్ ప్లాన్ మాస్టర్ పీస్‌లా ఉండాలని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందించేలా రూపొందించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, భువనేశ్వర్, అహ్మదాబాద్, బెంగళూరు, జైపూర్, భోపాల్, తిరువనంతపురం, గౌహతీ వంటి 15 నగరాలను పరిశీలించి 'కుడా' మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుల కనెక్టివిటీని, జాతీయ రహదారులకు సరిగ్గా అనుసంధానం చేయాలన్నారు. ఏయే కారిడార్లలో ఏయే పరిశ్రమలు ఉన్నాయి? ఇంకా ఏయే పరిశ్రమలు పెట్టడానికి వీలుంటుందనే విషయాలు స్పష్టం చేయాలన్నారు.
2016 వరంగల్ పర్యటనపై చర్చ
వర్షపు నీటి నిర్వహణ, మురుగునీటి కాలువల పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. పురావస్తు భవనాలు, దేవాలయాలను పరిరక్షిస్తూనే పర్యావరణ సహితంగా, పర్యాటకానికి వీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. గతంలో మంత్రి కేటీఆర్ సూచించిన విధంగా చేసిన మార్పులపై కూడా అధికారులను ఆరా తీశారు. మామునూరు ఎయిపోర్టును పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించారు. ఇక సీఎం కేసీఆర్ 2016లో వరంగల్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల పనులపై కూడా చర్చ జరిగింది.
1, 342 అభివృద్ధి పనులు మంజూరు
రూ. 817.20 కోట్ల విలువైన 1342 పనులు మంజూరయ్యాయని అధికారులు.. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వివరించారు. ఆయా పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెప్పగా నియోజకవర్గాల వారీగా చర్చించారు. పనులను అత్యంత వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.