ప్రజల ఆరోగ్యం కోసం హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. పార్కులో ఎనిమిది బ్లాకుల్లో ఎకరం విస్తీర్ణంలో ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు.
కంకరరాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నడకదారి నిర్మించారు. నడుస్తున్నప్పుడు పాదాల అడుగుభాగంలో ఉన్న నరాలపై ఒత్తిడి పడేలా ట్రాక్ నిర్మాణం చేశారు. ట్రాక్ వలయం మధ్యలో వివిధ రకాల ఔషధ మొక్కలను నాటారు.
ఈ పార్కును రూ. 16 లక్షలతో ఏర్పాటు చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇందులో 50 రకాల హెర్బల్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలో రేపు మరో 16 పంచతత్వ పార్కులు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందిరా పార్కును 4 కోట్ల రూపాయలతో మరింత అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీగా ఎంపికైన వారికి కేటీఆర్ అభినందనలు