రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. 10 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేసింది. ఎన్నికలు జరగనున్న నగరాలు, పట్టణాల్లో 53 లక్షల 36వేల 605 మంది ఓటర్లున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసే పనిలోనూ ఎస్ఈసీ నిమగ్నమైంది.
ఈనెల 8 వరకు అభ్యంతరాల స్వీకరణ..
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆదివారం ప్రకటించారు. ఈనెల 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న పోలింగ్ కేంద్రాల తుదిజాబితా ప్రకటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పురపాలక ఎన్నికల కోసం అవసరమైన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం 13 నగరపాలక సంస్థల మేయర్లు, 120 పురపాలక సంస్థల ఛైర్పర్సన్ల పదవులతో పాటు 3,112 వార్డుల సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ప్రకటించింది.
ప్రభుత్వ వెబ్సైట్లో రిజర్వేషన్ల వివరాలు..
రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పురపాలకశాఖ ఇప్పటికే అందించింది. వార్డుల సభ్యుల రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ పొందుపరిచారు. ఇందుకు సంబంధించి జిల్లా వారీ గెజిట్ పత్రాలను అందుబాటులో ఉంచారు. ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ అంతా పూర్తైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థల్లోని వార్డు సభ్యుల పదవులకు ఎన్నిక కోసం ప్రకటన జారీ చేస్తారు.
నేడే నోటిఫికేషన్..
385 కార్పొరేటర్ స్థానాలతో పాటు 2,727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 3,112 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయిలో ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుండగా... రేపు స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక కోసం నోటీసు ఇస్తారు. నోటీసు ఇచ్చినప్పటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు.
నామినేషన్ల దాఖలుకు ఈనెల 10 వరకు గడువు..
నామినేషన్ల దాఖలుకు ఈనెల 10 వరకు గడువుంది. 11న పరిశీలన చేపడతారు. నామినేషన్ల తిరస్కరణకు గురైనా.. వాటిపై 12న సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఎన్నికల అథారిటీ లేదా అదనపు, ఉప జిల్లా ఎన్నికల అథారిటీలతో పాటు వారు ధ్రువీకరించిన అధికారుల వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. మరుసటి రోజు అప్పీళ్లను పరిష్కరిస్తారు.
25న ఓట్ల లెక్కింపు..
నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంటుంది. అదే రోజు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించి గుర్తులు ప్రకటిస్తారు. ఈనెల 22న పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 25న చేపడతారు.
నోటిఫికేషన్ విడుదలపై అనుమానాలు..
నోటిఫికేషన్ విడుదల ఇవాళ హైకోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వేసిన పిటిషన్పై కూడా మంగళవారమే వాదనలు జరగనున్నాయి. మంగళవారం తమ నిర్ణయం ప్రకటించేవరకు నోటిఫికేషన్ జారీ చేయవద్దని ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నడుచుకోనుంది.
ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'