Telangana cabinet meeting: రాష్ట్ర కేబినెట్ భేటీలో ఓ అరుదైన పరిణామం జరిగింది. ఈ సమావేశానికి అనుకోని అతిథులు హాజరయ్యారు. ఈ సుధీర్ఘ భేటీకి పలువురు ఎంపీలు, ఎమ్మల్సీలు, ఎమ్మల్యేలు హాజరయ్యారు. కాగా వివిధ సమస్యలపై వారి అభిప్రాయలను కూడా తీసుకున్నట్లు సమాచారం. వివిధ అంశాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం సుధీర్ఘంగా సాగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన భేటీ... రాత్రి 11 గంటలు దాటాకా కూడా కొనసాగింది. కరోనా, విద్య, వ్యవసాయం, నీటిపారుదల రంగం, ఉద్యోగుల సంబంధిత అంశాలపై మధ్యాహ్నం చర్చ జరిగిన అనంతరం ధరణి పోర్టల్‌లోని సమస్యలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై చర్చించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ అమల్లో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రులు ఏకరువు పెట్టారు. అన్నీ సక్రమంగా ఉన్న వారి భూ లావాదేవీలు చాలా త్వరగా, సులువుగా జరుగుతున్నాయన్న మంత్రి... చిన్న చిన్న పొరపాట్లు, డేటా నమోదు లోపాలు తదితరాల కారణంగా కొందరు చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కొందరు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రులు తెలిపారు.
అనుకోని అతిథులు
క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని ఉదాహరణలను కూడా సమావేశంలో వివరించినట్లు తెలిసింది. అయితే అటువంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని.. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధరణి పోర్టల్ సమస్యలను శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా ఏకరువు పెడుతున్నారని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంటనష్టం అంశంపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను కేబినెట్ భేటీ జరుగుతున్న హాల్లోకి పిలిచి వారి అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం.
అరుదైన సంఘటన
ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతిలకు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం లభించింది. ఇటువంటి పరిణామం చాలా అరుదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ధరణి పోర్టల్ అమలు విషయమై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. వారు కూడా అమల్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలను వివరించినట్లు తెలిసింది.
ధరణి పోర్టల్‌పై చర్చ
మంత్రివర్గ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం మాడ్యూల్స్ అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఇంకా కూడా ఇబ్బందులు రావడం తగదని... ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్లకు తగిన అధికారాలు ఇచ్చి ఇబ్బందులన్నీ తొలగేలా చూడాలని ఆదేశించారు. రాజకీయాంశాలపై చర్చ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డిలను కూడా కేబినెట్ జరుగుతున్న హాల్లోకి పిలిచారు.
జాతీయ రాజకీయాలపై చర్చలు
జాతీయ రాజకీయాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయకపోగా... ఆ పార్టీ నేతలు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించినట్లు సమాచారం. భాజపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని... మంత్రులు, నేతలు ధీటుగా స్పందించాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. జాతీయస్థాయిలో శూన్యత ఉందని... జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొంతమంది మంత్రులు, నేతలు కోరినట్లు సమాచారం. అంశాల వారీగా పోరాటం చేయాలని మరికొందరు చెప్పినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: Minister KTR: 'ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది'