MP Kotha Prabhakar Reddy Health Bulletin : సిద్దిపేట జిల్లాలో కత్తి దాడికి గురై.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన.. వైద్యులతో మాట్లాడి ఎంపీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డికి 6 సెంటిమీటర్ల మేర కత్తి గాటు పడిందని వైద్యులు తెలిపారు. శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్లు గుర్తించామని.. చిన్న పేగుకు 4 చోట్ల గాయం అయిందని వివరించారు. చిన్న పేగును 15 సెం.మీ. మేర తొలగించి కుట్లు వేశామన్నారు. త్వరగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఇన్‌ఫెక్షన్ ముప్పు తప్పిందన్న వైద్యులు.. 10 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాలని చెప్పారు. అనంతరం కేసీఆర్.. ఎంపీ కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి 6 సెం.మీ. మేర కత్తిగాటు పడింది. శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్లు గుర్తించాం. చిన్న పేగుకు 4 చోట్ల గాయం అయింది. చిన్న పేగు 15 సెం.మీ. మేర తొలగించి కుట్లు వేశాం. 10 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాలి. - యశోద ఆసుపత్రి వైద్యులు
ఇదిలా ఉండగా.. ప్రభాకర్‌పై కత్తి దాడి అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దాడిని ఖండిస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. నిరాశలో ఉన్న కాంగ్రెస్ భౌతికదాడులకు దిగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావు లేదన్న కేటీఆర్.. ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. చికిత్స కోసం ప్రభాకర్‌రెడ్డిని తీసుకొచ్చిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లిన బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు.. మంత్రి హరీశ్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి.. ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రులు ఆరోపించారు.
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులతో ఎవరూ గెలవలేరన్న ఆయన.. కాంగ్రెస్ హింసను ఎప్పుడూ నమ్ముకోదన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతో కావాలనే తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అహింస మూల సిద్ధాంతంగానే పని చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఎవరైనా.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై తక్షణమే పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్‌రావు ఖండించారు. దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లు కాదని.. మహబూబ్‌నగర్‌లో స్పష్టం చేశారు. ఘటన జరగ్గానే కారణం రఘునందన్‌రావు అని.. బీజేపీ హింసను ప్రేరేపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.