MP Komatireddy Venkat Reddy Interesting Comments: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీల గురించి పట్టించుకోనని స్పష్టం చేశారు. నాలుగైదుసార్లు ఓటమి పాలైన వాళ్లతో తాను కూర్చోవాలా అని ప్రశ్నించారు.
బుధవారం రోజున నియోజకవర్గ పర్యటనల వల్ల.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేను కలవలేకపోయానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఇవాళ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఠాక్రేను కోమటిరెడ్డి కలిశారు. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఠాక్రేను ఎందుకు కలవలేదో ముందు అడగాలని వెంకట్‌రెడ్డి అన్నారు.
పార్టీ బలోపేతంపై ఠాక్రేతో చర్చించినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫొటో మార్ఫింగ్ అయినట్లు స్వయంగా పోలీస్ కమిషనర్ తనకు చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అయినా అధిష్ఠానం నుంచి ఎలాంటి చర్యలు లేవని వాపోయారు.
"ప్రజలలో పోవాలి.. పోరాటం చేయాలి. పార్టీ బలోపేతంపై చర్చించాం. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి, చాలామంది రాలేదు . షోకాజ్ నోటీసులు అనేది లేదు. మా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదు. నా ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా పోలీస్ కమిషనర్ నాకు చెప్పారు." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ
ఇవీ చదవండి: తుమ్మల ఇంటికి హరీశ్ రావు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
మంచు దుప్పటిలో శ్వేతవర్ణ శోభితంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి