bjp mp arvind vs mlc kavitha ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎంపీ అర్వింద్ పిటిషన్ దాఖలు చేశారు.తన ఇంటిపై దాడి ఘటనలో కవితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. బంజారాహిల్స్ పోలీసులు స్పందించడం లేదని ఎంపీ అర్వింద్.. పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేసు నమోదు చేసి 50 మంది తెరాస కార్యకర్తలను అరెస్టు చేసినట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదైనందున మరో కేసు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు చెప్పొచ్చని హైకోర్టు సూచించింది.
అసలు ఏం జరిగిందంటే..: ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై కొన్ని రోజుల క్రితం జెండాలు, కర్రలతో సుమారు 40-50 మంది తెరాస కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, జెండాకర్రలు, పూలకుండీలతో అర్వింద్ ఇంటి అద్దాలను పగులగొట్టారు. పోలీసులు తేరుకొని అదుపులోకి తీసుకునే లోపే విధ్వంసం సృష్టించారు. అరుపులు, కేకలు, అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలతో దాదాపు అరగంట సేపు అక్కడ వాతావరణం భయానకంగా మారింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను నెట్టుకొని ఆందోళనకారులు గేట్లు తీసి అర్వింద్ నివాసంలోకి దూసుకెళ్లారు. పడక గదితో పాటు మరో రెండు గదుల్లోకి వెళ్లి సామగ్రిని చిందరవందర చేశారు.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ అదేరోజు రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘వెంట పడి తంతాం.. చెప్పుతో కొడతాం, కొట్టి చంపుతాం’ అంటూ వ్యాఖ్యానించారని, 50 మంది తెరాస గూండాలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి ప్రేరేపించిన ఆమెపై సైతం కేసు నమోదు చేయాలని కోరారు. అయితే దీనిపై పోలీసులు స్పందించడం లేదని తాజాగా అర్వింద్ ఆరోపించారు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: