కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ముందు వరుసలో నిల్చునే పోరాట యోధులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 287 మంది పోలీసు సిబ్బంది, 90 మంది వైద్య సిబ్బంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. వీరిలో ఐపీఎస్ అధికారులు, సూపర్ స్పెషలిస్టు వైద్యనిపుణులు కూడా ఉన్నారు. మహమ్మారి కోరలకు చిక్కుకొని నలుగురు పోలీసులు మరణించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. వైరస్ మరింత విజృంభించనుందనే అంచనాలున్న నేపథ్యంలో.. బాధితులకు అండగా నిలవాల్సిన పోరాట యోధులు తమ ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి సారించాలని.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా మాస్కులు, ఇతర వ్యక్తిగత పరిరక్షణ వస్తువులను ధరించే విధులు నిర్వర్తించాలని సూచిస్తున్నారు.
వీరికి వైరస్ సోకే అవకాశాలెక్కువ
ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశాలెక్కువ. వీరితోపాటు బాధితులను ఆసుపత్రులకు తరలించే వైద్య సిబ్బందికి, ఇందుకు సహకరించే పోలీసులకు, చికిత్సనందించే వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బందికి కొవిడ్ సోకే ప్రమాదం పొంచి ఉంది. కట్టడి చర్యల్లో ముఖ్యభూమిక పోషించే వీరిలో.. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యాప్తి అధికమైంది.
రోగుల తాకిడితోనే వైద్యుల్లో వ్యాప్తి
గాంధీ ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలు నిలిపివేయగా.. ఆ మేరకు ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఇతర ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో వైద్యులకు కొవిడ్ సోకింది. ఓపీల్లో ప్రధాన పాత్ర పోషించే పీజీ వైద్యవిద్యార్థులు అధికంగా పాజిటివ్‌లుగా తేలారు. ఇందులో కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు సహా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు కూడా ఉన్నారు. ఇప్పటివరకూ 75 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధరణ అయ్యారు. ఇందులో మూడు కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన నలుగురు వైద్యులు కూడా ఉన్నారు.
ఎక్కువ మందిని కలిసినందుకే పోలీసుల్లో వ్యాప్తి
జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున.. పోలీసు సిబ్బందిలో అత్యధికులు హైదరాబాద్‌లోనే కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రం మొత్తమ్మీద 287 మంది పోలీసులకు కరోనా సోకగా, వారిలో హైదరాబాద్ పరిధిలోనే 252 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే 191 మంది పోలీసు కానిస్టేబుళ్లలో వైరస్ నిర్ధారణ అయింది. పోలీసులు నిత్యం కేసులు.. ఇతర విచారణల నిమిత్తం.. పలువురిని కలుస్తుండటం కొవిడ్ బారిన పడటానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బందోబస్తులు, ధర్నాలు తదితర కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాలుపంచుకుంటారు. ఇది మరో కారణంగా చెబుతున్నారు.
కరోనా కాటుకు వైద్యుడు, ఏఎస్సై బలి!
కొద్దిరోజులుగా జీహెచ్‌ఎంసీలో పెరుగుతున్న కరోనా కేసులు నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలో ఈ వైరస్‌తో పోరాడుతూ ప్రైవేటు వైద్యుడు మరణించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేశ్వర్‌రావు (72) కొవిడ్ చికిత్స పొందుతూ మృతిచెందారు. పాతబస్తీ జియాగూడలో ఆయన పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందించేవారని ఆయన బంధువులు తెలిపారు. ఇటీవలే పదోన్నతి పొంది నగరంలోని కాలాపత్తర్ ఠాణా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ (54) కూడా మహమ్మారితో పోరాడుతూ మృతి చెందారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్