భాగ్యనగరంలో కోటి మంది వరకు జనాభా ఉన్నారు. కరోనా వైరస్ ఇప్పటి వరకు 24 వేల మందిని తాకింది. వ్యాధి లక్షణాలు కనిపించక పరీక్షలు చేయించుకోని వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాప్తి ఎక్కువ ఉందో తెలుసుకునేందుకు డివిజన్ల వారీ సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ విశ్లేషిస్తోంది. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో యాక్టివ్ కేసులు ఏస్థాయిలో ఉన్నాయో పరిశీలిస్తోంది. శుక్రవారం ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే 8 డివిజన్లలో వందకుపైగా కేసులుండగా, రెండు డివిజన్లలో 150కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. 22 డివిజన్లలో పది, అంతకన్నా తక్కువ మంది బాధితులున్నారని అధికారులు ‘ఈనాడు’కు వివరించారు. వంద, అంతకంటే ఎక్కువ యాక్టివ్ కేసులున్న డివిజన్లలోని ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే తమను తాము మహమ్మారి బారిన పడకుండా చూసుకోగలరని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన బాధితుల్లో సగం మంది ప్రధాన నగరానికి చెందినవారే. నగరం నుంచి దిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిలో అధికులు ఖైరతాబాద్, చార్మినార్ జోన్లకు చెందినవారున్నారు. ఆ ప్రార్థనలకు హాజరైన విదేశీయుల ద్వారా పలువురు నగరవాసులకు వైరస్ సోకడంతో ఇక్కడ వ్యాప్తి ప్రారంభమైంది. విదేశాల నుంచి నగరానికి వచ్చిన కొవిడ్ బాధితులూ దీనికి జతయ్యారు. లాక్‌డౌన్ సమయంలోను అన్‌లాక్‌లోనూ ప్రజలు నిర్లక్ష్యంగా తిరగడంతో బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతోందని జీహెచ్‌ఎంసీ విశ్లేషించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలోని పలు సర్కిళ్లలో కంటెయిన్‌మెంట్ నిబంధనలను మెరుగ్గా అమలు చేయడంతో వ్యాప్తి తక్కువగా ఉందని అభిప్రాయపడింది.
జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారం
రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కొవిడ్ సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో ఉంచేందుకు సిద్ధమైంది. ఐటీ విభాగం ఇప్పటికే ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులు, చికిత్స పూర్తి చేసుకుని ఇంటికెళ్లినవారి వివరాలు, చికిత్స తీసుకుంటున్న వారు, మరణాలు, కంటెయిన్‌మెంట్ హోమ్స్ ఇతరత్రా సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని, శనివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఉన్నతాధికారి తెలిపారు.
జులై 10వ తేదీ ఉదయం వరకు కరోనా పరిస్థితి
మొత్తం కేసులు | 24101 |
కోలుకున్న వారు | 12880 |
యాక్టివ్ కేసులు | 10971 |
మరణించిన వారి సంఖ్య | 250 |
6 వేల మంది హోం ఐసోలేషన్‌లోనూ, మిగతా బాధితులు ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్