Rythubandhu : రాష్ట్రంలో రైతుబంధు పథకం పదో విడత డబ్బులను ఈ నెల 28 నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అందులో భాగంగా రెండో రోజు రైతుబంధు కింద రూ.1,218 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 15 లక్షల 96 వేల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. 24 లక్షల 36 వేల 775 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించి ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.1,218 కోట్ల 38 లక్షలు రైతులకు పెట్టుబడి సాయంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
రైతుబంధు పథకం | రైతుల ఖాతాల సంఖ్య | భూ విస్తీర్ణం | జమ చేసిన డబ్బులు(రూ.కోట్లలో) |
ఎకరానికి రూ.5 వేల చొప్పున | 15,96,000 | 24,36,775 ఎకరాలు | 1218.38 |
రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: వ్యవసాయ వృద్ధి కోసమే రైతుబంధు పథకం అని మంత్రి అన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సాగునీరు, మిషన్ కాకతీయ, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న గత పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవని అన్నారు. ప్రభుత్వ చర్యల మూలంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర పథకాల గురించి దేశంలో చర్చ: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశమంతా అమలు జరగాలని భారత రైతాంగం డిమాండ్ చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ పాలన, తెలంగాణ పథకాల గురించి మాట్లాడుకోవడం మొదలైందని చెప్పారు. కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయని.. అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
ఇవీ చదవండి: