Money Fraud in Hyderabad by African : డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఆ డబ్బులు సంపాదించడానికి మంచి మార్గాన్ని ఎంచుకుంటున్నామా లేక చెడు మార్గమా అన్నది ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలి.. సెటిల్ అవ్వాలని కొందరు చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. చివరకు కటకటాలపాలవుతున్నారు. ఇదే సమయంలో డబ్బుపై ఉన్న ఆకర్షణను ఆసరా చేసుకుంటూ కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో రకం నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వండి.. వాటిని డబుల్ చేస్తామని వారి ముందే చిన్నగా చేసి చూపితే ఎవ్వరూ నమ్మరు. అదే.. రూ.లక్షల్లో డబ్బులు డబుల్ చేసి ఇస్తామంటే ఇట్టే నమ్మేస్తారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లో ఇద్దరిని బురడీ కొట్టించిన ఆఫ్రికన్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వెస్ట్ ఆఫ్రికా ఐవెరీ కోస్ట్‌కు చెందిన జోన్గుయే రోస్టండ్ అలియాస్ డౌడ.. బిజినెస్ వీసాపై 2021లో హైదరాబాద్‌కు వచ్చాడు. సన్‌సిటీలో నివాసం ఉంటూ విలాసాలకు అలవాటుపడ్డాడు. గతేడాది జనవరిలోనే ఇతని వీసా గడువు ముగిసింది. అయినా.. అక్రమంగా ఇక్కడే నివాసం ఉంటూ పలు రకాల మోసాలు చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద ఉన్న శక్తితో కరెన్సీ నోట్లను డబుల్ చేస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇదే క్రమంలో గత నెలలో మాదాపూర్‌కు చెందిన ఓ వ్యాపారిని కలిసిన జోన్.. అతని వద్ద ఉన్న రూ.25 లక్షలను రూ.50 లక్షలు చేస్తానని మోసగించి ఉడాయించాడు. తాజాగా ఎల్బీనగర్కు చెందిన మరో బాధితుడిని మోసం చేసేందుకు ప్రయత్నించగా ఎల్బీనగర్ ఎస్‌వోటి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే నకిలీ రూ.5 వందల నోట్లు, 5 కెమికల్ బాటిళ్లు, కెమికల్ పౌడర్లు, పాస్ పోర్ట్ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
African Money Fraud in Hyderabad : నిందితుడు జోన్ కేవలం వ్యాపారస్థులు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని.. సంప్రదించిన వారిని తన హస్త లాఘవంతో బురిడీ కొట్టిస్తున్నాడు. ముందుగా నమ్మించేందుకు నిందితుడు తన ఎడమ చేతిలో అసలైన రెండు రూ.5 వందల నోట్లను పెట్టుకుంటాడు. బాధితుల నుంచి ఒక ఐదు వందల నోటు తీసుకుంటాడు. ఆ నోటును రెండు తెల్ల పేపర్ల మధ్యలో పెడతాడు. వాటికి అయోడిన్, ఇతర కెమికల్స్‌ను పూస్తాడు. అనంతరం దాన్ని ఎన్వలప్ కవర్లో పెడుతున్నాడు. బాధితుడిని కొంచెం సేపు ఆగమని చెప్పి దాన్ని నీటితో ఉన్న మగ్గులో పెడతాడు. అదే సమయంలో బాధితుడి దృష్టి మరల్చి తన ఎడమ చేతిలో ఉన్న రెండు 5 వందల నోట్లను మగ్గులో పడేస్తాడు. వాటిని బాధితుడికి ఇస్తున్నాడు. ఇదంతా చూసి నిజమేనని నమ్ముతున్న బాధితులు.. అధిక మొత్తంలో డబ్బును అతనికి ఇచ్చి రెట్టింపు చేయమని చెబుతున్నారు.
ఇదే క్రమంలో మాదాపూర్‌కు చెందిన ఆదర్ష్ అనే వ్యాపారి..జోన్‌కు రూ.25 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన నగదును అట్లల్లో పెట్టాడు. తన వద్ద ఉన్న నకిలీ నోట్లు, కొన్ని తెల్ల పేపర్లను కూడా అట్టలో పెట్టాడు. వాటికి తన వద్ద ఉన్న కెమికల్ పౌడర్ పూసి ఊదాడు. దీంతో బాధితుడికి కళ్లు మండాయి. కళ్లు నలుచుకుని చూసేలోపు అసలైన నగదును తీసుకున్న జోన్.. అందులో నకీలీ నోట్లు పెట్టాడు. కెమికల్ రియాక్షన్ జరుగుతుందని.. 4, 5 గంటల పాటు తెరవకూడదని చెప్పి జోన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అట్టను తెరచి డబ్బులు చూసుకున్న బాధితుడు ఆదర్ష్ మోసమని గ్రహించి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఎల్బీనగర్కు చెందిన బాధితుడి నుంచి రూ.10 లక్షలు కాజేసేందుకు జోన్ ప్రయత్నిస్తుండగా.. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డబ్బులు రెట్టింపు చేయడం అనేది జరగని పని అని.. ఇలా సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరగాళ్లు ఎత్తులు వేస్తారని.. ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: