పోటీపడి డబ్బులు పంచిన అభ్యర్థులు
పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పక్కా ప్రణాళికతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం పోలింగ్ పూర్తి చేసింది. ఓ వైపు పోలీసులు, ఎన్నికల అధికారులు ఓ కన్నేసి ఉంచినా..అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బు, మద్యం పంచిపెట్టారు. కొంతమంది నేరుగా నగదు రూపంలో, బహుమతుల రూపంలో పంచితే మరికొందరు కాస్త అడ్వాన్స్‌గా ఆలోచించి గూగుల్ పే, ఫోన్‌పేల ద్వారా నగదు బదిలీ చేశారు. ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకట్టుకోడానికి, ప్రలోభపెట్టడానికి పోటీ పడ్డారు అభ్యర్థులు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కో ఓటుకు నలభై వేల రూపాయలతో పాటు మద్యం కూడా పంచారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓటుకు తులం బంగారం పంచారు.
డబ్బుకు దాసోహమన్న ఓటర్లు
ఎలక్షన్లు అనగానే విచ్చలవిడిగా డబ్బులు పంచడం ఆనవాయితీగా మారింది. ఓట్ల కోసం అభ్యర్థులు కోట్ల రూపాయల వరద పారించారు. టూర్ ప్యాకేజీలు, ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ ఎన్నికల గండం నుంచి గట్టెక్కి విజయ తీరాలకు చేరాలనుకున్నారు. ఓటర్లు సైతం ఓటుకు ఇంత అని అభ్యర్థులను డిమాండ్ చేశారు. అందరి దగ్గర డబ్బులు తీసుకొని మా ఓటు మీకే వేస్తాం అని చెప్పారు. ఇరువర్గాల దగ్గర డబ్బులు, బహుమతులు తీసుకోవటం వల్ల ఓటు తమకే వేస్తారో.. ప్రత్యర్థులకు వేస్తారో అని టెన్షన్ పడడం అభ్యర్థుల వంతైంది.
ఈ ఎన్నికల్లో గెలిచేదేది ఎవరు..?
మరి.. ఈ ఎన్నికల్లో గెలిచేదేది ఎవరు..? అభ్యర్థులు పంచిన నోట్లా? ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఓటా? పోలింగ్ పల్స్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అభ్యర్థుల్లోనూ ఇదే ఆందోళన నెలకొంది. ఇది తెలియాలంటే ఈ నెల 25న ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.
ఇవీ చూడండి: కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు