కేసీఆర్ పాలనలో సబ్బండ వర్ణాలు నష్టపోతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తెదేపా అభ్యర్థి ఎల్.రమణ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలన నడుస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని జీవీఆర్ గార్డెన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హాజరైన తెదేపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
తెరాస, భాజపా, కాంగ్రెస్కు చెందిన అభ్యర్థులు ఓటర్ల మనోభావాలను తెలుసుకోలేరని... వారికి ప్రజల్లో తిరిగిన అనుభవం లేదని రమణ అన్నారు. ఎమ్మెల్సీ రాంచంద్రరావు పట్టభద్రులకు చేసిందేమీ లేదని తెలిపారు. ప్రస్తుతం తెరాస తరఫున పోటీ చేస్తున్న సురభి వాణీదేవి విద్యాసంస్థలను నడపడం తప్ప ప్రజా సమస్యలపై పోరాడిందేమీ లేదని పేర్కొన్నారు. తనకు మెుదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను రమణ కోరారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉండాలి : సీఎం కేసీఆర్