రైతుల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 6 నెలల వ్యవధిలో 206 రైతు వేదికలు నిర్మించామని.. రూ.750 కోట్ల వ్యయంతో లక్ష రైతు కల్లాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు చనిపోయిన 10 రోజుల్లోపు రూ.5 లక్షలు చెల్లిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని.. కానీ భాజపా నేతలు అవగాహన, సోయి, విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో మాదిరిగా ఉచిత నాణ్యమైన విద్యుత్, రైతు బంధు, రైతుబీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
కోటి 45 ఎకరాల్లో సాగు
ఈ యాసంగిలో కోటి 45 ఎకరాల్లో సాగు అయిందన్నారు. భాజపా నేతలకు దమ్ముంటే ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురావాలని లేదా ఒక వైద్య కళాశాలను తేవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. రైతుల గోస పట్టించుకునేది కేసీఆర్ మాత్రమేనన్నారు. రైతు బీమా ద్వారా 50,600 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. భాజపా పాలిత ప్రాంతాల్లో రైతు సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరో 6 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నామని.. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ తీసుకురావాలన్నారు.
72 శాతం పూర్తయింది
కరోనా బాధితులకు సీఎం కేసీఆర్ స్వయంగా ధైర్యం చెప్పడంతో పాటు.. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నారన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా జరుగుతున్నాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 7వేల కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. దాదాపుగా 72 శాతం పూర్తయిందని.. భాజపా నేతల ఆరోపణలు అర్థరహితమని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రానున్న మూడురోజులు రాష్ట్రానికి వర్షసూచన