40 ఏళ్లు పైబడిన మహిళలు అందరూ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ జయలత సూచించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన నడక నిర్వహించగా... ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు అవగాహన నడకను రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రజ్వీతో కలిసి కవిత జెండా ఊపి ప్రారంభించారు.
సమాజంలో అత్యంత భయంకరమైన వ్యాధిలో క్యాన్సర్ ఒకటని... ఈ వ్యాధి పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కవిత(mlc kavitha about Breast cancer) సూచించారు. గతంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేవలం వయస్సు పైబడిన వారికే వచ్చేదని... ప్రస్తుతం యువతులకూ ఈ వ్యాధి వస్తోందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబంలో అమ్మాయిలకు సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆమె సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యాన్ని పట్టించుకొని అనారోగ్యం బారిన పడకుండా కుటుంబసభ్యులు చూడాలని కవిత సూచించారు.
పెద్దఎత్తున ప్రాణాలు తీస్తున్న భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అందులో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి... చాలా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి వస్తోంది. కాబట్టి దీన్ని నిర్మూలించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇదివరకు అరవై ఏళ్లకు పైబడిన వారికి వచ్చే క్యాన్సర్ ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచే వస్తోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబసభ్యుల మీద ఉంది. ఆడపిల్లలకు తప్పకుండా సంపత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించడం, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరుచుకోవడం ముఖ్యమైన అంశాలు. కుటుంబసభ్యులందరూ ఈ శ్రద్ధ తీసుకోవాలి.
-కవిత, ఎమ్మెల్సీ
ఈ వ్యాధిని త్వరగా గుర్తిస్తే... పూర్తిగా జబ్బును నయం చేసి పూర్తి లైఫ్ ఇవ్వొచ్చు. వాళ్లకి పూర్తి సపోర్టు ఇవ్వొచ్చు. 40 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండు సార్లు పరీక్ష చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఈ జబ్బు బారిన పడకూడదని... ఒకవేళ పడినా మనమందరం సపోర్టుగా ఉన్నామని... ఈ విధంగా త్వరగా గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయవచ్చనే నినాదాన్ని మనం చాటుదాం.
-జయలత, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్
ఇదీ చదవండి: Rains in Hyderabad: గుంతపల్లి-మజీద్‌పూర్ మార్గంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు