MLA Quota MLC Elections Telangana 2024 : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన రెండు మండలి స్థానాలకు నిర్వహించే ఎన్నికపై గందరగోళం నెలకొంది. పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరిల రాజీనామాలతో ఏర్పడిన రెండు స్థానాలతోపాటు ఉత్తరప్రదేశ్‌లో ఒక స్థానానికి ఈ నెల 29న ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యుల్ విడుదల చేసింది. ఇందులో మూడు ప్రత్యేక ఉప ఎన్నికలు (త్రీ సెపరేట్ బై ఎలక్షన్స్) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నిక నిర్వహిస్తారా? లేదంటే ఒకటిగానా? అనే విషయంపై గందరగోళం నెలకొంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సాధారణంగా ఇదీ విధానం : వాస్తవంగా చూస్తే ఒక రాష్ట్రంలో ఒకే రోజు ఎన్నికై ఒకే రోజు పదవీ కాలం ముగిసే ఎమ్మెల్సీలకు (Telangana MLC Election Schedule) నిర్వహించే ఎన్నికను ఒకటిగానే పరిగణలోని తీసుకుంటారు. ఒకే బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం తెలంగాణలోని రెండు స్థానాలు ఈ కోవలోకే వస్తాయి. అసెంబ్లీలోని సభ్యుల మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఓటు విలువ నిర్ణయిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు విలువ 40గా ఉంటుంది.
రెండింటికి ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్‌లోని 64 మంది ఎమ్మెల్యేలు, మొదటి ప్రాధాన్య ఓటుగా 40 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. బీఆర్ఎస్‌కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా మరోటి అవసరమవుతుంది. ఎంఐఎం మద్దతు ఇస్తే భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థికి 46 ఓట్లు పడే అవకాశం ఉంది. రెండింటికి ఒకేసారి ఎన్నిక జరిగితే హస్తం పార్టీకి, గులాబీ పార్టీకి ఒక్కో స్థానం దక్కుతుంది. ఒకవేళ విడివిడిగా నిర్వహిస్తే ప్రతి ఎమ్మెల్యే ఇద్దరికి విడివిడిగా ఓటు వేయాల్సి ఉంటుంది. తద్వారా 64 మంది సభ్యులున్న కాంగ్రెస్‌కు రెండూ దక్కే అవకాశం ఉంది.
ఎన్నికల సంఘానికి లేఖ : ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం స్పష్టత కోసం, కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం లేఖ రాసింది. ఈ నెల 11న ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో అంతలోపే స్పష్టత వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
Telangana MLC Election Schedule 2024 : తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అందులో భారత్ రాష్ట్ర సమితికి 28 మంది ఎమ్మెల్సీలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క సభ్యుడు జీవన్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్ పార్టీకు చెందిన ఇద్దరు సభ్యులు, బీజేపీ తరఫున ఒక్కరు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. నామినేషన్ల జోరు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!