శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్(MLC Election Schedule) విడుదలైంది. నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుండగా... 29న పోలింగ్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం... తాజాగా ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఆరు స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో ఆకుల లలిత, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 3న పూర్తైంది. ఏపీలో చిన్నగోవింద్ రెడ్డి, మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం మే 31వ తేదీతో పూర్తైంది. కరోనా రెండో దశ కారణంగా వారి పదవీకాలం ముగిసేలోగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. రెండు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులతో... మండలి ఎన్నికల(MLC Election Schedule) నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది.
షెడ్యూల్ ఇదే..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 17న పరిశీలన... నవంబర్ 22 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.
ఇదీ చదవండి: Huzurabad by election news: ప్రైవేటు వాహనంలో వీవీప్యాట్ తరలింపు.. భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన