భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పలుకుబడి ఉపయోగించి జైల్లో పెట్టించినా.. అక్కడినుంచి అయినా ఆయనను పదవిలోంచి దించుతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. ఎస్సీ మహిళలు తన ఇంటిపై దాడి చేసిన సమయంలో తాను ఇంట్లో లేనని స్పష్టం చేశారు. దళితులపై దాడి చేసినట్లుగా రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటనపై స్పందించిన మైనంపల్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
దళితులు నా ఇంటిపై దాడి చేసినప్పుడు నేను ఇంట్లో లేను. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించుకోవచ్చు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా అనేక ఫోన్లు వస్తున్నాయి. త్వరలోనే ఆయన బండారం బయటపెడతా. జైలుకు వెళ్లడానికి అయినా సిద్ధమే. బండిని ఎంపీ పదవి నుంచి దించేవరకు ఊరుకోను. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే రకం కాదు నేను. అవసరమైతే రెండు చెంపలూ పగలగొడతా.
-మైనంపల్లి హనుమంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే
చర్చలకు సిద్ధం
బండి సంజయ్‌కి వ్యతిరేకంగా తనకు వందలాది ఫోన్లు వస్తున్నాయని మైనంపల్లి అన్నారు. పూర్తి ఆధారాలతో త్వరలో ఆయన బండారం బయటపెడతానని పేర్కొన్నారు. ఆయన పలుకుబడి ఉపయోగించి జైల్లో పెట్టినా.. అక్కడి నుంచి అయినా బండి సంజయ్‌ను పదవి నుంచి దింపుతానని హెచ్చరించారు. బండి సంజయ్‌తో ఎలాంటి చర్చలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తనకు కుల, మత భేదాలు లేవని.. దళితుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశానని మైనంపల్లి అన్నారు.
ఇదీ చదవండి: gandhi hospital rape: గాంధీ ఆస్పత్రి ఘటనలో అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం