పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలున్నా, ప్రజలు ఇబ్బంది పడినా, అధిష్ఠానం నిర్ణయం మేరకు మేము సహకరిస్తూనే వచ్చామన్నారు. రాజకీయంగా ఎక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. తెరాసలో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా డమ్మీలేనని, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ 'వన్ మ్యాన్ షో' నడుస్తోందని ఆరోపించారు. దేశం కోసం పని చేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సైనికులను అవమానపరిచేట్లు మాట్లాడిన మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నట్లా.. లేనట్లా... అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో జరగరానిది ఏమైనా జరిగితే అందుకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంత్రి తలసాని ఏ రోజు సంగారెడ్డికి వచ్చినా అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ బట్టలు ఊడదీసి కొడతానని చెప్పిన తలసాని... ఇప్పుడు కేసీఆర్‌కు భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్