Etela Comments on KCR: సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ దివాళా తీయించారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి రాచరికం అనుభవించడం తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేసీఆర్ పాలనపై ఈటల విమర్శలు గుప్పించారు. కేసీఆర్ డొల్లతనాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందని ఈటల అన్నారు. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లు దాటిందని.. కార్పొరేషన్లు ఏవీ కూడా అప్పు తీర్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
'ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలకు దేశమంతా ఒకే విధానం వర్తిస్తుంది. అప్పులు చేసి రాచరికం అనుభవించడం తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు. మంత్రులకు వారి శాఖల మీద అవగాహన లేదు, వారి మాటకు విలువ లేదు. మిల్లర్లు క్వింటాల్‌కు 8 కిలోల తరుగు తీస్తున్నా... పట్టించుకునే వారు లేరు. మద్యం దుకాణాల్లో నిల్వ ఉన్న లిక్కర్‌పై కొత్త ధరలు అమలు చేయడం దారుణం. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ధాన్యం సేకరణలో రైతులకు ఇంతవరకూ డబ్బులివ్వలేదు. -ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
ఇక్కడి సమస్యలు పరిష్కరించే సత్తా లేకనే కేసీఆర్ దేశ పర్యటనలు చేస్తున్నారని ఈటల విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం పొంది... ఇప్పుడు ఈ ప్రజలనే గంగలో ముంచుతున్నారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాలు చేస్తామంటూ గతంలో తిరిగిన నేతలు ఏమయ్యారో అందరికీ తెలుసన్నారు. నిరంకుశంగా వ్యవహరించిన వారికి ఏ గతి పట్టిందో అదే గతి కేసీఆర్‌కూ పడుతుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: 'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్ లాంటి పరిస్థితులు'
టెట్ రోజే ఆర్ఆర్బీ.. కేటీఆర్‌కు వాయిదా విజ్ఞప్తి.. సబిత ఏమన్నారంటే..
'హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే కాదు.. ఒకసారి బస్తీలకూ వచ్చి చూడండి'