balka suman on rahul gandhi and jp nadda: రెండు జాతీయ పార్టీల నేతలు తెలంగాణపై దండయాత్రకే వస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆరు దశాబ్ధాలుగా భాజపా, కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ నుంచి విముక్తి కావాల్సి ఉందని తెలిపారు. భారతదేశం చైనా, అమెరికాలను మించి పోవాలని కేసీఆర్ అనడం వల్లే కాంగ్రెస్, భాజపా తెలంగాణపై కక్ష కట్టాయని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ విజన్ భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదో రాహుల్ గాంధీ, నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, విభజన హామీలపై భాజపా వైఖరి చెప్పిన తర్వాతే జేపీ నడ్డా రాష్ట్రంలో అడుగు పెట్టాలని పేర్కొన్నారు.
''దేశంలో పామాయిల్ పంటలను ఎందుకు ప్రోత్సహించట్లేదు. కేంద్ర అసమర్థ విధానాల వల్ల ఇండోనేషియా పామాయిల్ నిషేధించింది. పామాయిల్ పంట ప్రోత్సాహానికి రైతులకు రుణాలు ఇవ్వాలి. పామాయిల్ ఎగుమతి చేసే దిశగా భారత్ ఉత్పత్తి ఎందుకు పెంచుకోదు. పామాయిల్ స్వీయ ఉత్పత్తిపై కేంద్రానికి సరైన ఆలోచన లేదు. పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు పండించుకునే అవకాశం ఉంది. దేశ ప్రజల అవసరాలు ఆలోచించకుండా ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితి ఏర్పడింది. ఇతర దేశాలు నిషేధం విధించగానే దిగుమతి సుంకాలు తగ్గిస్తున్నారు. స్వదేశీ విధానం సరిగా లేని అసమర్థ విధానం కేంద్రానిది. దేశంలో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రతిపక్షం సరిగా పోరాటం చేయట్లేదు.''
- బాల్కసుమన్, ప్రభుత్వ విప్
రాహుల్ గాంధీ చేతకాని తనమే భాజపాను గెలిపిస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. రాహుల్ భాజపాపై పోరాటంలో ఫైటర్గా మారతారా లేదా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో తేల్చుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలతో రైతులు సతమతమవుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై రాహుల్ దృష్టి పెట్టాలని చెప్పారు. ఓయూ వీసీ బీసీ కాబట్టే కాంగ్రెస్ నేతలు చీరలు, గాజులు పంపించారని.. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తీరు మార్చుకోక పోతే... తగిన సమాధానం ఇస్తామని సుమన్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: