MLA Balakrishna Hindupuram Tour: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణకు చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు అంబిక లక్ష్మీనారాయణ కూతురు వివాహానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు హాజరయ్యారు. పట్టణంలోని ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుకల్లో బాలకృష్ణ వసుంధర దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రను చూసి అధికార పార్టీ భయపడుతోందని.. అందుకే అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని హిందూపురం బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామానికి రూ.35 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి స్వయంగా జేసీబీ యంత్రాన్ని నడిపారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక పరిశ్రమ లేదు.. ఉపాధి ఉద్యోగాలే లేవని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అలాగే హిందూపురం పట్టణంలోని సరస్వతీ విద్యా మందిరంలో హెరిటేజ్ సంస్థ ఆర్థిక సహకారంతో పాఠశాలకు కంప్యూటర్లను వితరణ చేశారు. అనంతరం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వల్లే ఈ ప్రాంతంలో అనేక పాఠశాలలు వచ్చాయని అన్నారు.
ఇక తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల ఆ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ‘యువగళం’ ప్రారంభం కానుంది. పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఇది కొనసాగనుంది.
ఇవీ చదవండి: