Traffic Police Attack : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వాహన చోదకుడిపై ట్రాఫిక్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి ఘటన ఏపీలోని అనంపురం జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం వద్ద జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసు కానిస్టేబుల్ మాత్రం అంతా ఆ ముగ్గురు యువకులదే తప్పని వివరణ ఇస్తున్నారు.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, అనంతపురం నగరానికి చెందిన యువకులు శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. ఈ క్రమంలో గడియారం స్తంభం వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ, డ్రక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. సరిగ్గా అక్కడే ముగ్గురు యువకులు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో వారికి ట్రిపుల్ రైడింగ్ జరిమానాను ట్రాఫిక్ పోలీసులు విధించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే జరిమానాను చెల్లించే విషయంలో యువకులు, పోలీసులకు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.
ఈ వాగ్వాదంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ బాబు.. బైకు నడిపిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో యువకుడిని వెనక్కి తోశాడు. దీంతో అక్కడే ఉన్న మిగతా పోలీసు సిబ్బంది బూతులు తిడుతూ, చేతులు, కాళ్లతో యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీశారు. ఆ వీడియోలను కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైరల్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై విమర్శలు చేశారు.
యువకులే అసభ్యంగా మాట్లాడారు : ఈ మొత్తం వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కానిస్టేబుల్ బాలు స్పందించారు. ముగ్గురు యువకులు బైక్‌పై రాంగ్రూట్లో వచ్చారని తెలిపారు. ఆపి, ట్రిఫుల్ రైడింగ్‌కు జరిమానా వేశామన్నారు. వారు జరిమానా చెల్లించం అంటూ వాదనలకు దిగారని వివరించారు. ఇంతలో ఆ ముగ్గురిని పరీక్ష చేయగా ఇద్దరు మద్యం తాగినట్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తేలిందన్నారు. ముగ్గురు యువకుల్లో ఒకరు తమ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా దాడికి ప్రయత్నించాడన్నారు. తామెంత వారించినా బూతులు తిట్టాడని కానిస్టేబుల్ బాలు వివరించారు.