రాష్ట్రంలో ధాన్యంసహా ఇతర వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో బీఆర్కే భవన్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యంపై నిఘా పెట్టాలని మంత్రులు సూచించారు.
రాష్ట్రంలో పండిన పంటలో 25 నుంచి 30 శాతం మాత్రమే కొనాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. దళారులు, వారికి సహకరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పెసర్లు, సోయాబీన్ పంటల్లో... కనీసం 50 శాతమైనా కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని... మార్కెట్లలో తేమ కొలిచే మీటర్లు, కాంటాలు, క్లీనర్లు, టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. 3,327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ... ఇప్పటికే 670 ప్రారంభించిందని స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా 252 జిన్నింగ్ మిల్లులు, 102 వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిన దృష్ట్యా ఇప్పటికే 252 కేంద్రాలు ప్రారంభయ్యాయని ప్రకటించారు.
ఇవీ చూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో