SECUNDERABAD BONALU: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17,18 వ తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వారంలోగా ఆలయంలో చేపట్టిన పనులను పూర్తి చేయనున్నట్లు తెలియచేశారు.
ఉజ్జయిని మహంకాళి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేయడం సంతోషకరమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బోనాల పండుగకు ఎంతో విశిష్టత ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ఉజ్జయిని మహంకాళి జాతరను ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు హజరయ్యారు.
ఇదీ చదవండి: వరద నీటిలో బోల్తాపడ్డ స్కూల్ బస్సు.. 8 మంది విద్యార్థులు!