ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, యునిసెఫ్, ఇన్‌క్విల్యాబ్ కలిసి ఆగస్టు 28న స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. 33 జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇందులో భాగం చేసింది. మొత్తం 4వేల41 ప్రభుత్వ పాఠశాలలు, 23 వేల 881 విద్యార్థులు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఎస్ఐసీలో భాగంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 7 వేలకు పైగా ఇన్నోవేటివ్ ఐడియాలను ప్రతిపాదించారు. నిపుణులు కమిటీ వీటినుంచి 25 ఐడియాలను షార్ట్ లిస్ట్ చేసి హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న ఆవిష్కరణలు
విత్తనాలు విత్తే సైకిల్, క్రౌడ్ సెన్సర్ అలారం, డ్రాపవుట్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ యాప్, ప్లాస్టిక్ కవర్లకు బదులు బయెడిగ్రేడబుల్ నర్సరీ బ్యాగులు వంటి ఆవిష్కరణలను విద్యార్థులు ప్రదర్శించారు. వికలాంగుల కోసం హైడ్రాలిక్ వీల్ ఛైర్లు, స్త్రీలకు ఉపయోగపడే ఆర్గానిక్ స్త్రీ రక్ష ప్యాడ్లు, బ్లూటూత్ మాస్క్ డివైస్, ఆర్గానిక్ చాక్ పీస్, మల్టీపర్పస్ అగ్రికల్చర్ బ్యాగ్, ఎయిర్ ప్రెషర్ ట్యాప్ వంటి 25 ఆవిష్కరణలను విద్యార్థులు ప్రదర్శనకు ఉంచారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరణలను తిలకించి వారిని అభినందించారు. వీటిలో మొదటి 3 ఇన్నోవేషన్లకు నగదుతో కూడిన బహుమతులను, పది ఇన్నోవేషన్లకు ప్రోత్సాహక బహుములు మంత్రులు అందించారు.
మొదటి బహుమతి యాదాద్రి విద్యార్థులకు...
యాదాద్రి జిల్లా మొల్కపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన స్త్రీ రక్ష ప్యాడ్స్‌కు ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో మొదటి బహుమతి పొందటంతో పాటు.. 75 వేల నగదు బహుమతిని అందుకున్నారు. స్త్రీలు ఉపయోగించే మార్కెట్లో దొరికే ప్యాడ్స్ కన్నా.. తాము తయారు చేసిన ఆర్గానిక్ ప్యాడ్స్ కేవలం రెండు రూపాయలకే రూపొందించవచ్చని విద్యార్థులు తెలిపారు. పూర్తి సహజపద్ధతిలో తయారు చేయడంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని విద్యార్థినులు వివరించారు. మహబూబాబాద్ దంతాలపల్లికి చెందిన విద్యార్థులు వ్యవసాయపనుల్లో వినియోగించే మల్టీపర్పస్ బ్యాగ్‌ను రూపొందించి రెండో బహుమతికి ఎంపికయ్యారు. పొలం పనుల్లో తమ తల్లిదండ్రులు ఎదుర్కొంటోన్న సమస్యలు తమను ఈ ఆవిష్కరణ దిశగా ప్రేరేపించాయని విద్యార్థులు తెలిపారు. మూడో బహుమతిగా ఆదిలాబాద్ జిల్లా బంగారిగూడకు చెందిన విద్యార్థులు రూపొందించిన ఆర్గానిక్ చాక్ పీస్ మూడో బహుమతిగా ఎంపికైంది.
మంత్రుల హర్షం
నాలుగు నెలల పాటు సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత ఆవిష్కరణ రూపంలో వెల్లివిరిసిందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు ఎవరి సొత్తూ కాదని... పిల్లలకు ప్రోత్సాహం ఇస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని... మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆవిష్కరణలను అన్ని జిల్లాలకు విస్తరించాలని... పరిశ్రమలతో అనుసంధానించాలని మంత్రి తెలిపారు. కొవిడ్ సమయంలో టీ-శాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించటంతో పాటు.. వారి కెరియర్ గైడెన్స్ పోర్టల్ ద్వారా భవిష్యత్ మార్గదర్శనం చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
- ఇదీ చూడండి : హైదరాబాద్‌లో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు