Ministers Review on TS Decade Celebrations : హైదరాబాద్లోని నూతన సచివాయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్.. తమ శాఖల పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే కొత్తగా చేపట్టిన ధూప దీప నైవేద్య పథకం వర్తింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే దశాబ్ది వేడుకలను దేవాదాయ వాఖ తరపున ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Indrakaran Reddy Review on TS Decade Celebrations : ఈ క్రమంలోనే ప్రతి ఆలయంలోనూ ఆధ్మాత్మిక శోభ వెల్లివిరిసేలా కార్యక్రమాలు చేపట్టాలని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన దేవాదాయశాఖకు చెందిన భూములను.. తిరిగి రాబట్టే విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. ఇందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ ద్వారా దశల వారీగా.. ఇప్పటి వరకు 6,002 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆలయ భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో.. ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందు ఉంచాలని ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి ఆలయ భూముల సంరక్షణకు.. పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకనగుణంగా ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని.. రామయ్య భూముల సంరక్షణకు వారు సహకరించాలని కోరారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న దేవాదాయశాఖపై.. లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయని విమర్శించారు. ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : యాదాద్రిలో భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో వేచి ఉన్న అన్ని సమయాల్లో భక్తులకు మంచినీరు అందించాలని.. ఎండవేడిమి నుంచి సేద తీరేలా వసతులు కల్పించాలని ఆయన వివరించారు.
Satyavathi Rathod Review on TS Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనోత్సవాల నిర్వహణ.. మహిళాభివృద్ధి - శిశుసంక్షేమ శాఖ వారోత్సవాలపై మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. గిరిజన విద్యాలయాల్లో సంబరాలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఆర్ట్ ఫ్రేమ్ల ప్రదర్శన.. ఉత్పత్తుల వర్క్ షాప్లు ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ క్రమంలోనే పోడు పట్టాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు.
మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా.. శ్రీమంతం, అన్నప్రాశన, కిశోర బాలికలకు కిట్స్ అందజేయాలని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. అంగన్వాడి బాటలో భాగంగా మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా వివరించాలని సత్యవతి రాఠోడ్ వెల్లడించారు.
ఇవీ చదవండి : Telangana Decade Celebrations : దశాబ్ది ఉత్సవాల ఖర్చులకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల